దీపావళి సందర్భంగా చైనా మార్కెట్ కు 40 వేలకోట్ల నష్టం
By: Sankar Tue, 17 Nov 2020 08:11 AM
దీపావళి సందర్భంగా దేశ వ్యాప్తంగా సుమారు 72 వేల కోట్ల మేర అమ్మకాలు జరిగినట్లు ది కాన్ఫెడెరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సీఏఐటీ) వెల్లడించింది.
దేశంలోని ప్రధాన మార్కెట్ల(పట్టణాల) నుంచి సేకరించిన వివరాల ప్రకారం పండుగ నేపథ్యంలో ఈ మేరకు భారీ మొత్తంలో టర్నోవర్ జరిగిందని, దీంతో చైనాకు 40 వేల కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. కాగా కరోనా వైరస్ వ్యాప్తి, తూర్పు లదాఖ్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా ఉత్పత్తులను బహిష్కరించాలంటూ అంబానీ, టాటా, అజీం ప్రేమ్‌జీ, మిట్టల్ తదితర దేశీయ పారిశ్రామిక దిగ్గజాలకు సీఏఐటీ గతంలో లేఖ రాసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో భారత సైనికులను పొట్టనబెట్టుకున్న డ్రాగన్ ఆర్మీ దురాగతాలను నిరసిస్తూ బ్యాన్ చైనా అంటూ ప్రచారం నిర్వహించిన ఈ ట్రేడ్‌బాడీ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది.ఈ మేరకు.. ‘‘దేశంలోని 20 ప్రధాన వాణిజ్య పట్టణాల నుంచి సేకరించిన నివేదిక ప్రకారం దీపావళి పండుగ సందర్భంగా సుమారు 72 వేల కోట్ల మేర టర్నోవర్ జరిగింది.తద్వారా చైనా మార్కెట్‌కు 40 వేల కోట్ల నష్టం వాటిల్లింది. భవిష్యత్‌లోనూ ఇలాంటి మంచి ఫలితాలే లభిస్తాయని ఆశిద్దాం’’ అని పేర్కొంది