ఉమ్మి వాడొద్దు అంటే ఎలా ..?
By: Sankar Tue, 16 June 2020 9:34 PM
కరోనా వైరస్ కారణంగా కొన్నాళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ కార్యకలాపాలాన్నీ నిలిచిపోయాయి. ఒకవేళ గైడ్‌లైన్స్ పాటిస్తూ ఆయా బోర్డులు ధైర్యం చేసి సిరీ్‌సలను ఆరంభించినా అవి మునుపటిలా మాత్రం జరిగే వీలులేదు. ప్రేక్షకులు లేకుండా మ్యాచ్‌లను ఆడించడమే కాకుండా చాలా కొత్త పద్ధతులకు అలవాటు పడాల్సి ఉంటుంది. అందుకే వచ్చేనెల 8 నుంచి ఇంగ్లండ్-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే మూడు టెస్టుల సిరీ్‌సపై అందరి దృష్టీ నెలకొంది. ఆటగాళ్లు కరోనా బారిన పడకుండా బయో సెక్యూర్ వాతావరణంలో ఈ సిరీస్ జరగనుంది. ఇకనుంచి బంతి మెరుపు కోసం బౌలర్లు లాలాజలం ఉపయోగించరాదని ఐసీసీ ఇప్పటికే ఆదేశించింది. ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో ఇదే పెద్ద చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఉమ్మిని వాడకుండా బౌలర్లు బంతిని స్వింగ్ చేయలేరని, దీంతో ఆట బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా మారుతుందని తాజా, మాజీ ఆటగాళ్లంతా విమర్శిస్తున్నారు. ముఖ్యంగా టెస్టు ఫార్మాట్‌లో ఈ తేడా స్పష్టంగా కనిపిస్తుందని చెబుతున్నారు.
కుంబ్లే నేతృత్వంలోని ఐసీసీ క్రికెట్ కమిటీ ఉమ్మిని నిషేధించినా.. చెమటను మాత్రం ఉపయోగించవచ్చని సూచించింది. కానీ ఇది ఏమేర ప్రభావం చూపగలదని విశ్లేషకులు సందేహిస్తున్నారు. అయితే కరోనా సద్దుమణిగాక ఉమ్మి వాడడంపై నిషేధం ఉండదని ఐసీసీ తేల్చింది. కానీ అప్పటిదాకైనా బౌలర్లు ఎలా విజయవంతం కాగలరని ప్రశ్నిస్తున్నారు. నిజానికి బంతి మెరుపు కోసం ఫాస్ట్ బౌలర్లు చెమటను కాకుండా ఉమ్మికి ఎందుకు ప్రాధాన్యమిస్తారో పేసర్లు షమి, ఇర్ఫాన్ తెలిపారు.
బంతిని బరువుగా, మృదువుగా మార్చేందుకు చెమటను వినియోగిస్తాం. కానీ రివర్స్ స్వింగ్ కావాలంటే మాత్రం ఉమ్మి కావాల్సిందే. ఇది బంతిని గట్టిగా మార్చడంతో పాటు మెరుపును అందిస్తుంది’ అని షమి తెలిపాడు. అలాగే పిచ్‌లను బౌలర్లకు అనుకూలంగా తయారుచేయాలని ఇర్ఫాన్ కోరాడు. ముఖ్యంగా రివర్స్ స్వింగ్‌ను రాబట్టేందుకు పేసర్లకు ఉమ్మిని రుద్దడం చాలా అవసరమని నొక్కిచెప్పాడు. ‘టెస్టు క్రికెట్ ఇంతకుముందులా కనిపించదు. అందుకే ఇక పిచ్‌లను పచ్చిక ఎక్కువ ఉండేలా లేక టర్నింగ్ ట్రాక్‌లాగా అయినా మార్చాలి. కొన్నాళ్లపాటు ఫ్లాట్ ట్రాక్‌ను రూపొందించడం మానుకోవాలి’ అని ఇర్ఫాన్ ఐసీసీకి సూచించాడు