అక్రమ నిర్మాణాలు, వెంచర్లు భారీగా వెలుగుచూస్తున్న ‘గ్రేటర్’ విశాఖ...
By: chandrasekar Wed, 11 Nov 2020 7:59 PM
రాష్ట్రవ్యాప్తంగా
అనధికార నిర్మాణాలు భారీగా వెలుగుచూస్తున్నాయి. ప్రజల ఆవాస అవసరాలు పాలకుల రాజకీయ
అవసరాలు వెరసి అధికార యంత్రాంగం కూడా షరా
'మామూలు'గా వదిలేయడంతో వీటి జోరు కొనసాగుతోంది. ప్రధానంగా
పట్టణ స్థానిక సంస్థ (యూఎల్బీలు)ల్లో వందల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు
వెలుస్తున్నాయి. పట్టణాభివృద్ధి సంస్థ (‘ఉడా’) ల్లోనైతే భారీ సంఖ్యలో అనధికార లే
అవుట్లు వెలుస్తున్నట్లు సమాచారం. యూఎల్బీల్లో అక్రమ వెంచర్లు, ‘ఉడా’ల్లో
అనధికార నిర్మాణాలు కూడా పెద్దసంఖ్యలోనే జరుగుతున్నాయి. అక్రమ వెంచర్లలో
ఏఎంఆర్డీయే (గతంలో ఏపీసీఆర్డీయే) ప్రథమ స్థానంలోనూ, అనధికార నిర్మాణాల్లో
ద్వితీయ స్థానంలోనూ నిలవడం విశేషం. డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్
(డీటీసీపీ) ఆధ్వర్యంలో రాష్ట్రంలో పట్టణ ప్రణాళికా సిబ్బంది ద్వారా గత నెల మొదటి
వారం నుంచి ఈ నెల 9వ తేదీ వరకు జరిగిన సర్వేలో ఈ విషయాలు వెలుగు చూశాయి.
రాష్ట్రం మొత్తం మీద 52,509 అక్రమ నిర్మాణాలున్నట్లు తేలగా, 10,477 అనధికార వెంచర్లున్నట్లు నిర్ధారణ అయింది. వీటిల్లో అనధికార నిర్మాణాల
విషయంలో రాష్ట్రంలో గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) 6,731లతో
ప్రథమస్థానంలో నిలవగా, వెంచర్లకు సంబంధించి ఏఎంఆర్డీయే 1306లతో
ముందంజలో ఉంది!
అక్రమ వెంచర్లు..
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం
10,477 అక్రమ వెంచర్లు వెలియగా, వీటిల్లో 1306 ఒక్క ఏఎంఆర్డీయే పరిధిలోనే ఉన్నాయి. ఆ తర్వాతి
స్థానాల్లో ‘ఆహుడా’లో 680, ‘ఏలూరు ఉడా’లో 563,
వీఎంఆర్డీయేలో 454,
‘గుడా’లో 411,
‘కుడా’లో 370,
నెల్లూరులో 357,
ఒంగోలు ‘ఉడా’లో 282,
ఒంగోలులో 282,
‘ఏ ఉడా’లో 226,
జీవీఎంసీలో 214,
‘నుడా’లో 193,
‘బుడా’లో 158,
ఎమ్మిగనూరులో 145,
ధర్మవరంలో 137,
పుత్తూరులో 137,
అనంతపురంలో 136,
తాడేపల్లిగూడెంలో 118, భీమవరంలో 115
ఉన్నాయి. ఇవే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణాభివృద్ధి సంస్థలు, పట్టణ
స్థానిక సంస్థల్లోనూ పదులూ, వందల సంఖ్యలో అక్రమ వెంచర్లు రూపుదిద్దుకుంటున్నాయి.
అక్రమ నిర్మాణాలు...
అనుమతి పొందిన ప్లాన్లకు
విరుద్ధంగానో లేదా అసలు ప్లాన్లే తీసుకోకుండానో రాష్ట్రంలోని మొత్తం 137
యూఎల్బీలు, ‘ఉడా’ల్లో ఏకంగా 52,509 నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నట్లుగా తాజా పరిశీలనలో
తేలింది. వీటిల్లో జీవీఎంసీ పరిధిలో 6,731 ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో ఏఎంఆర్డీఏ (పూర్వపు
ఏపీసీఆర్డీయే)లో 2,448, నెల్లూరులో 2,401,
విజయవాడలో 2,389,
‘గుడా’లో 1929,
కర్నూలులో 1614,
వీఎంఆర్డీయేలో 1596,
గుంటూరులో 1482,
కడపలో 1235 వెలిశాయి. ఇవే కాకుండా విజయనగరం, అనంతపురం, తిరుపతి, ఒంగోలు, రాజమహేంద్రవరం, ఏలూరు
‘ఉడా’, చిత్తూరు, మంగళగిరి, ఎమ్మిగనూరు, కాకినాడ, తణుకు, ఒంగోలు
‘ఉడా’, ఆదోని, ధర్మవరం, రాయచోటి, ఏలూరు, నంద్యాల, గూడూరు, మదనపల్లి, ‘తుడా’, కావలి, కదిరి, తాడిపత్రి, శ్రీకాకుళం, యేలేశ్వరం, హిందూపురం, నర్సీపట్నం, మండపేట, అమలాపురం, ‘ముడా’, నరసరావుపేట, గుంతకల్లు, పుత్తూరు, బద్వేలు, కళ్యాణదుర్గం, గుడివాడ, భీమవరం, నెల్లిమర్ల, ‘ఎస్‌యుడా’, రేపల్లె...
ఇలా దాదాపు అన్ని నగరాలు, పట్టణాలతోపాటు వివిధ ‘ఉడా’ల పరిధిలోనూ వందల సంఖ్యలో
అనధికార నిర్మాణాలు వెలుస్తున్నట్లు కనుగొన్నారు.
క్రమబద్ధీకరణ...
ఈ అనధికార నిర్మాణాలు, వెంచర్లలో
ఇళ్లు లేదా స్థలాల క్రమబద్ధీకరణకు పురపాలక శాఖ చర్యలు తీసుకోవాల్సి ఉంది.
దీంతోపాటే ఆయా స్థిరాస్తి ప్రాజెక్టుల్లో ఆస్తులను కొనుగోలు చేసిన వారికి కూడా
రెగ్యులరైజ్ చేసుకునేందుకు అవకాశమివ్వాల్సి ఉంది. వీటన్నంటినీ గుర్తించి ఇప్పటికే
ఆన్‌లైన్‌లో నమోదు కూడా చేశారు. ఇప్పుడు సదరు డేటా ఆధారంగా ఆయా ప్రాజెక్టులు, లే
అవుట్లను అభివృద్ధి పరుస్తున్న ప్రమోటర్లు, డెవలపర్లు, బిల్డర్లు, రియల్టర్లకు రానున్న రోజుల్లో నోటీసులు జారీ చేయడం
ద్వారా వాటి క్రమబద్ధీకరణకు ముందుకొచ్చేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు
సమాచారం.