కరోనా బారిన పడిన ఫార్ములా వన్ దిగ్గజ ఆటగాడు లూయిస్ హామిల్టన్
By: Sankar Tue, 01 Dec 2020 5:28 PM
ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది కరోనా బారిన పడిన విషయం తెలిసిందే ..సామాన్య ప్రజలు మాత్రమే కాకుండా అనేక మంది ప్రముఖులు కూడా ఈ కరోనా మహమ్మారి కి గురి అయ్యారు..ఇక తాజాగా ఫార్ములా వన్ ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ కూడా కరోనా బారిన పడ్డాడు.
ఆదివారం బహ్రెయిన్‌లో జరిగిన 11వ గ్రాండ్ ప్రిని సొంతం చేసుకున్న హామిల్టన్‌కు కరోనా సోకడంతో ఆందోళన కలిగిస్తోంది. అయితే ఆయనలో స్వల్ప లక్షణాలు ఉన్నాయని, ప్రస్తుతం హామిల్టన్ ఆరోగ్యం బాగానే ఉందని మెర్సిడెజ్ ఏఎంసీ పెట్రొనాస్ టీం తెలిపింది. అయితే త్వరలో జరిగే సాఖిర్ గ్రాండ్ ప్రికి హామిల్టన్ దూరమవుతున్నట్లు టీమ్ వెల్లడించింది.
కాగా 7 సార్లు ఫార్ములా వన్ చాంపియన్‌గా నిలిచిన హామిల్టన్ రేసింగ్‌లో చరిత్ర సృష్టించాడు. అయితే ఆయనకు గత వారంలో మూడు సార్లు పరీక్షలు నిర్వహించగా ప్రతిసారి నెగెటివ్ వచ్చింది. ఈ తరుణంలో ఆదివారం కూడా ఆయనలో కరోనా లక్షణాలు కనిపించడంతో సోమవారం కోవిడ్ పరీక్షలు నిర్వహించగా ఆయనకు కరోనా పాజిటివ్‌గా తెలింది. దీంతో హామిల్టన్ ప్రస్తుతం బహ్రెయిన్‌లోనే ఐసొలేషన్‌లో ఉన్నాడు.