కరోనా నిబంధనలు పాటిస్తేనే ఓట్ వేయడానికి అనుమతి...నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి
By: Sankar Wed, 07 Oct 2020 3:27 PM
నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఈ నెల 9న పోలింగ్ ప్రక్రియ జరగనుందని, మాస్కులు, గ్లౌజులు ధరిస్తేనే పోలింగ్ కేంద్రాల్లోకి ఓటర్లను అనుమతిస్తామని కలెక్టర్ నారాయణరెడ్డి స్పష్టం చేశారు.
నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై కలెక్టర్ నారాయణరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. 9వ తేదీన ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుందని చెప్పారు. 12న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. 6 టేబుళ్లు, 2 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 824 మంది ఓటర్లకు 50 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు.
బ్యాలెట్ పేపర్ల ద్వారానే ఈ ఉప ఎన్నిక నిర్వహిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. మాస్కులు, గ్లౌజులు ధరిస్తేనే పోలింగ్ కేంద్రంలోకి ఓటర్లకు అనుమతి ఉంటుందని తెలిపారు. కొవిడ్ పాజిటివ్ ఓటర్లకు చివరి గంటలో అవకాశం ఇస్తామని తెలిపారు. కొవిడ్ పాజిటివ్ ఓటర్లకు పీపీఈ కిట్లు, అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచుతామన్నారు. పోస్టల్ బ్యాలెట్‌కు కూడా అవకాశం కల్పిస్తామని, అందుకు రేపు ఉదయం దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు.