ఫోన్ ప్రియుల హైప్‌ను పెంచే గూగుల్ పిక్సెల్ 5జీ ఫోన్ల డిజైన్
By: chandrasekar Tue, 29 Sept 2020 1:38 PM
ప్రపంచవ్యాప్తంగా
ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గూగుల్ కంపెనీ 5G హ్యాండ్ సెట్లను
మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్ధమైంది. సెప్టెంబరు 30న ఒక
ఈవెంట్లో పిక్సల్ 5, పిక్సల్ 4ఏ 5జీ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేస్తామని గతంలో
ప్రకటించింది. అయితే అనుకోకుండా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటికి వచ్చాయి.
తద్వారా ఈ ఫోన్ల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న కస్టమర్లలో ఆతృతను మరింత పెంచింది. పిక్సల్ 5, పిక్సల్
4ఏ 5జీ
స్మార్ట్ ఫోన్లకు సంబంధించిన డిజైన్, ఫీచర్స్‌తో పాటు దాని ధరను పొరబాటున జపాన్‌లోని
అధికారిక ట్విట్టర్ ఖాతాలో గూగుల్ పేర్కొంది.
గూగుల్ పిక్సెల్ 5, పిక్సెల్
4a 5G స్మార్ట్ఫోన్లపై స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వర్గాలు ఎప్పటి నుంచో
చర్చించుకుంటున్నాయి. సరికొత్త ఫీచర్లతో
వస్తున్న మోడళ్లపై స్మార్ట్ఫోన్ యూజర్లు
చాలాకాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో జపాన్లో
గూగుల్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో పిక్సెల్ 5 మోడల్స్ డీజైన్, దాని
ఫీచర్లు, దాని
ధరను అనుకోకుండా వెల్లడించారు. పిక్సెల్ 5 కోసం రూపొందించిన వీడియో టీజర్ను గూగుల్ ట్విట్టర్
హ్యాండిల్లో యాక్సిడెంటల్గా పోస్ట్ చేశారు.
కొత్త పిక్సెల్ స్మార్ట్ఫోన్
డిజైన్, 5జి
కనెక్టివిటీపై గూగుల్ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే జపాన్లో 5జీ
ఫోన్లను విడుదల చేయాలనుకుంది. పిక్సెల్ 5 హోల్ పంచ్ డిజైన్, దాని ధర, ఫీచర్లకు
సంబంధించిన పూర్తి వివరాలు లీకయిన వీడియో టీజర్లో ఉన్నాయి.
పిక్సెల్-5
స్మార్ట్‌ఫోన్ ధర:
అందిన సమాచారం ప్రకారం
జపాన్లో పిక్సెల్-5 స్మార్ట్‌ఫోన్ ధర JPY 74,800 (సుమారు రూ.52,260). గత సంవత్సరం జపాన్లో పిక్సెల్-4తో మోడల్ను జెపివై 89,980 (రూ.62,860) ప్రారంభ ధరతో విడుదల చేశారు. లీకైన వీడియోతో పాటు ఒక పేజ్ కూడా గూగుల్
ట్విట్టర్ హ్యాండిల్లో ఉన్నట్టు సంస్థ చెబుతోంది. ఇప్పుడు ఆ పేజీ లైవ్లో లేదు.
ఫోన్ ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉందని ఆపేజీలో ఉన్నట్టు తెలుస్తోంది.
"గూగుల్ నుంచి వస్తున్న 5జి స్మార్ట్ఫోన్ గూగుల్ పిక్సెల్ 5, ప్రీ-ఆర్డర్
కోసం అందుబాటులో ఉంది. ఫాస్ట్ మూవీ డౌన్లోడింగ్, ప్రొఫెషనల్-గ్రేడ్
ఫోటోగ్రఫీని ఆస్వాదించండి. ఉత్తమ స్పెక్స్తో 5జి అనుభవాన్ని పొందండి" అని గూగుల్ టీజర్లో
ఉన్నట్లు 9to5Google వెబ్సైట్ పేర్కొంది. గూగుల్ పిక్సెల్ స్మార్ట్ఫోన్ను
విడుదల చేసిన ప్రతిసారీ మార్కెట్ వర్గాలు దాని ఫీచర్లపై దృష్టి సారిస్తాయి. కానీ
అనుకోకుండా ఈసారి రెండు రోజుల ముందే పిక్సెల్ ఫోన్ల గురించి సమాచారం బయటకు
తెలిసింది. గూగుల్ పిక్సెల్ 5, పిక్సెల్ 4ఎ 5జి లను భారత్ లో
విడుదల చేయట్లేదని ఈ ఏడాది ప్రారంభంలో ఆ కంపెనీ తెలిపింది.