సికింద్రాబాద్లో దంపతులు ఉరేసుకుని ఆత్మహత్య
By: chandrasekar Thu, 03 Sept 2020 6:56 PM
దంపతులు ఆత్మహత్య చేసుకోవడం సికింద్రాబాద్ పరిధిలో స్థానికంగా కలకలం సృష్టించింది. కుటుంబ కలహాల కారణంగా ఇద్దరూ ఇంట్లోనే ఉరేసుకుని చనిపోయారు. ఈ విషాద ఘటన సికింద్రాబాద్‌లోని చిలకలగూడ పీఎస్ పరిధిలో జరిగింది. సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అంబర్ నగర్‌లో నివాసముంటున్న వెంకటేష్, భార్గవి దంపతులు గురువారం ఉదయం ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మెదక్ జిల్లాకు చెందిన వెంకటేష్‌కు భార్గవి అనే మహిళతో ఎనిమిదేళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వెంకటేశ్ విద్యుత్ శాఖలో ఏఈగా పనిచేస్తున్నాడు. భార్గవి పోస్టల్ శాఖలో పనిచేస్తోంది. అత్తమామలు వేధింపులకు గురిచేస్తుండటంతో భార్గవి భర్తతో కలిసి బయటకు వచ్చేసి కొంతకాలం క్రితం వేరే కాపురం పెట్టినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం వీరు చిలకలగూడ పరిధిలోని అంబర్ నగర్‌లో నివాసం ఉంటున్నారు. గురువారం ఉదయం వెంకటేశ్ గదిలో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించగా, భార్గవి బాత్రూమ్ లో ఉరేసుకుంది. దీంతో కుటుంబసభ్యులు చిలకలగూడ పోలీసులకు సమాచారం అందించారు. భార్గవి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కచ్చితమైన కారణాలపై విచారణ జరుపుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఆర్ధిక ఇబ్బందులా, అనారోగ్య సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకున్నారా అన్న కోణంలో పోలీసులు ఎంక్వయిరీ చేస్తున్నారు.