Advertisement

  • పుష్కర ఘాట్లలో కలకలం రేపుతున్న కరోనా పాజటివ్ కేసులు...

పుష్కర ఘాట్లలో కలకలం రేపుతున్న కరోనా పాజటివ్ కేసులు...

By: chandrasekar Fri, 27 Nov 2020 4:05 PM

పుష్కర ఘాట్లలో కలకలం రేపుతున్న కరోనా పాజటివ్ కేసులు...


తుంగభద్ర పుష్కరాల ఘాట్ల వద్ద కరోనా నేపథ్యంలో పుష్కరాలకు వచ్చే పలువురు భక్తులకు, అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం 128 మంది సిబ్బంది, భక్తులకు ర్యాపిడ్ కిట్ల ద్వారా కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో ముగ్గురికి కరోనా పాజిటి‌వ్‌గా నిర్ధారణ అయింది. కరోనా పాజిటివ్‌గా తేలివారిలో ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక భక్తుడు ఉన్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఈ ఇద్దరు కానిస్టేబుల్స్ సంకల్‌బాగ్ ఘాట్, రాంరబొట్ల ఆలయంలో విధులు నిర్వర్తించేందుకు వచ్చారు. తాజా కేసులతో పుష్కర ఘాట్లలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజటివ్ కేసుల సంఖ్య 15కి చేరింది. అయితే వీరిలో 14 మంది పోలీసులే ఉన్నారు. కరోనా నేపథ్యంలో అధికారులు పుష్కర ఘాట్ల వద్ద ప్రత్యేక ఏర్పాటు చేశారు.

ప్రతి పుష్కర ఘాట్ వద్ద ఒక అంబులెన్స్‌తో పాటు, హెల్త్ స్క్రీనింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. పుష్కర ఘాట్ల వద్దకు వచ్చే ప్రతి భక్తునికి థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. ఆ తర్వాతే వారిని ఘాట్ల వద్దకు అనుమతిస్తున్నారు. ఒకవేళ భక్తులకు ఏవైనా లక్షణాలు కనబడితే వారి సాంపిల్స్ సేకరించి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ప్రతి పుష్కర ఘాటు వద్ద వైద్య సిబ్బందిని ఉంచామని కర్నూలు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. అలాగే భక్తులు కూడా మాస్క్‌లు ధరించాలని, ఘాట్ల వద్ద కోవిడ్ ప్రొటోకాల్స్ పాటించాలని కోరుతున్నారు. ఇక, ఈ నెల 20వ తేదీన ప్రారంభమైన పుష్కరాలు డిసెంబర్ 1వరకు కొనసాగనున్నాయి. ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుష్కరాలను ప్రారంభించారు. ఈ నెల 20న కర్నూల్‌లోని సంక‌ల్‌బాగ్ ఘాట్ వద్ద ఆయన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తుంగభద్ర నదికి పసుపు, కుంకుమ, సారె సమర్పించారు. ఇక, తుంగభద్ర పుష్కరాల కోసం ఏపీ ప్రభుత్వం 23 ఘాట్లను ఏర్పాటు చేసింది. కరోనా నేపథ్యంలో భక్తుల పుష్కర స్నానాలకు అనుమతివ్వలేదు. కేవలం నదిలోని నీటిని మాత్రమే తలపై జల్లుకునేందుకు అనుమతిచ్చారు. అంతేకాకుండా పుష్కరాల వేళ ప్రధాన ఘాట్లలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Tags :
|
|

Advertisement