ఐశ్వర్యరాయ్‌తో పాటు కుమార్తె ఆరాధ్యకు కరోనా నెగిటివ్
By: chandrasekar Tue, 28 July 2020 1:53 PM
ముంబైలోని నానావతి
హాస్పిటల్‌లో కొవిడ్-19 సోకి
చికిత్స పొందుతోన్న ప్రముఖ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ డిశ్చార్జ్ అయ్యారు. ఈ
విషయాన్ని ఆమె భర్త, నటుడు అభిషేక్ బచ్చన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
తన భార్య ఐశ్వర్యరాయ్‌తో పాటు ఎనిమిదేళ్ల కుమార్తె ఆరాధ్యకు కూడా కొవిడ్-19
నెగిటివ్ రావడంతో ఇద్దరూ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లిపోయారని ఆయన పేర్కొన్నారు.
అయితే, తన
తండ్రి అమితాబ్ బచ్చన్, తను ఇంకా హాస్పిటల్‌లోనే ఉన్నామని వెల్లడించారు. భర్త అభిషేక్ బచ్చన్, మామ అమితాబ్ బచ్చన్‌కు
కరోనా పాజిటివ్ వచ్చిన ఒక రోజు తరవాత 46 ఏళ్ల ఐశ్వర్యరాయ్‌కు కూడా పాజిటివ్ అని తేలింది.
ఆమెతో పాటు కూతురు ఆరాధ్యకు కూడా పాజిటివ్ వచ్చింది. దీంతో వారం రోజుల పాటు బచ్చన్
నివాసం ‘జల్సా’లో ఐశ్వర్య, ఆరాధ్య ఐసోలేషన్‌లో ఉన్నారు. ఆ తరవాత జులై 17న
వీరిద్దరినీ నానావతి హాస్పిటల్‌కు పంపారు. అంతకు ముందే జులై 11న
అమితాబ్, అభిషేక్
బచ్చన్ ఇదే హాస్పిటల్‌లో చేరారు.
అయితే, అమితాబ్
సతీమణి జయా బచ్చన్‌కు కరోనా నెగిటివ్ వచ్చింది. తన భార్య ఐశ్వర్యరాయ్, కుమార్తె
ఆరాధ్యకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు జులై 12న అభిషేక్ బచ్చన్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
అంతకు ముందే, మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ తోపే కూడా
ఐశ్వర్యరాయ్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్ వచ్చినట్టు ట్వీట్ చేశారు. కానీ, కాసేపటికే
ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు. దీంతో జనాల్లో కాస్త కన్‌ఫ్యూజన్. ఈ కన్‌ఫ్యూజన్‌కు తన
ట్వీట్‌తో తెరదించారు అభిషేక్ బచ్చన్.