బెయిర్‌స్టో మెరుపు సెంచరీ...ఇంగ్లాండ్‌ను ఆదుకున్నజోడీ
By: chandrasekar Thu, 17 Sept 2020 12:31 PM
మూడో వన్డేలో ఆస్ట్రేలియాతో తలపడిన ఇంగ్లాండ్ భారీ స్కోరు
సాధించింది. ఓపెనర్ బెయిర్‌స్టో మెరుపు
సెంచరీతో చెలరేగడంతో పాటు శామ్ బిల్లింగ్స్ అర్ధశతకంతో రాణించడంతో ఇంగ్లాండ్ నిర్ణీత ఓవర్లలో 7
వికెట్లకు 302 పరుగులు చేసింది. ఆఖర్లో టీ20
తరహాలో వేగంగా ఆడిన క్రిస్ వోక్స్ (53 నాటౌట్) హాఫ్‌సెంచరీతో ఆకట్టుకున్నాడు. తీవ్ర ఒత్తిడిలోనూ బెయిర్‌స్టో, బిల్లింగ్స్
అద్భుత పోరాటపటిమను చూపారు. ప్రత్యర్థి బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ కీలక సమయంలో
మంచి భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు భారి స్కోరును అందించారు.
96కే నాలుగు వికెట్లు చేజార్చుకున్న ఇంగ్లాండ్‌ను ఈ
జోడీనే ఆదుకున్నది. ఇక ఆఖర్లో
టెయిలెండర్లు తలో చేయి వేయడంతో ఇంగ్లాండ్
300
మార్క్‌ను చేరుకున్నది. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, ఆడమ్
జంపా చెరో మూడు వికెట్లు పడగొట్టారు. టాస్
గెలిచి మొదట బ్యాటింగ్ దిగిన ఇంగ్లాండ్‌కు స్టార్క్ షాకిచ్చాడు. కొత్త బంతితో బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించాడు.
ఇన్నింగ్స్ తొలి ఓవర్
వేసేందుకు బంతిని అందుకున్న స్టార్క్..మొదటి బంతికి ప్రమాదకర జేసన్ రాయ్‌ను
పెవిలియన్ పంపాడు. ఆ తర్వాతి బంతికే అప్పుడే క్రీజులోకి వచ్చిన జో రూట్‌ను ఔట్
చేసాడు. దీంతో ఇంగ్లాండ్ కనీసం పరుగుల ఖాతా తెరువకుండానే రెండు కీలక వికెట్లు
పోగొట్టుకున్నది. తర్వాత పుంజుకున్న
ఇంగ్లీష్ జట్టు స్పూర్తిదాయక ఆటతో ఆడింది. సున్నా స్కోరుకే ఆతిథ్య జట్టు రెండు
ప్రధాన వికెట్లను పడగొట్టి ఆరంభంలో పైచేయి సాధించిన ఆసీస్ ఆఖర్లో ధారళంగా పరుగులు
ఇచ్చేసింది.