అక్కడ పెరిగిన అసెంబ్లీ ఎన్నికల వేడి...!
By: Anji Mon, 12 Oct 2020 10:23 AM
బీహార్‌లో పెరుగుతోన్న ఎన్నికల వేడి కారణంగా అక్కడ కరోనాను ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు.. కరోనాను ఎలెక్షన్స్ డామినేట్ చేస్తున్నాయి.. మొదటి దశ పోలింగ్ దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీల హడావుడి ఎక్కువయ్యింది.. ముఖ్యమంత్రి, జనతాదళ్ యునైటెడ్ పార్టీ అధినేత నితీశ్‌కుమార్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు..
ఇప్పుడు అధికారంలోకి రాకపోతే ఆయన రాజకీయ భవిష్యత్తు ఆగమ్యగోచరంలో పడతుంది.. అందుకే ఓటర్లను ఆకర్షించుకోవడానికి హామీల మీద హామీలు గుప్పిస్తున్నారు.. నిన్న ఏడు అంశాలతో రెండో హామీ పత్రాన్ని విడుదల చేశారాయన! విద్యార్థులు, నిరుద్యోగులను ఈ హామీ పత్రం ఆకట్టుకునేట్టుగా ఉంది.. రాష్ట్రంలో మరిన్ని ఐటీఐలు ఏర్పాటు చేస్తామని, వ్యాపారం చేసుకోవాలనుకునే యువతకు 50 శాతం సబ్సిడీతో రుణాలు ఇస్తామని నితీశ్ చెప్పారందులో.. అలాగే ఇంటర్ పాసైన విద్యార్థినులకు పాతిక వేల రూపాయలు, డిగ్రీ పాసైన విద్యార్థినులకు 50 వేల రూపాయలు ఆర్ధిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు.
బీజేపీ పరువు ప్రతిష్టలకు ఈ ఎన్నికలు ఓ సవాల్‌గా నిలిచాయి కాబట్టి ఆ పార్టీ కూడా ఎన్నికల ప్రచారాన్ని పెంచేసింది. రాష్ట్రీయ జనతాదళ్‌పై విమర్శలు గుప్పిస్తోంది.. జయప్రకాశ్ నారాయణ్ పేరు చెప్పుకుని పైకి వచ్చిన పార్టీ ఇప్పుడేమో అధికారం కోసం కాంగ్రెస్‌తో చేతులు కలిపిందని ఎద్దేవా చేసింది. నిన్న 46 మంది అభ్యర్థులతో మరో లిస్టును ప్రకటించింది. ఇప్పటి వరకు 75 మంది అభ్యర్థులను ఖరారు చేసింది బీజేపీ. తాజా లిస్టులో రాష్ట్ర మంత్రి నంద కిశోర్ యాదవ్, నితీశ్ మిశ్రాల పేర్లు ఉన్నాయి.
కాంగ్రెస్‌కు కూడా ఈ ఎన్నికలు జీవర్మరణ సమస్య.. ఇందులో గెలిస్తే కాంగ్రెస్ మనుగడకు ఢోకా ఉండదు.. అందుకే ఎలాగైనా సరే ఎక్కువ సీట్లను సాధించాలనే గట్టి పట్టుదలతో ఉంది.. ఇప్పటికే పోల్ కమిటీలు ప్రకటించి వాటికి దిశా నిర్దేశం చేసింది.