ప్రతివారం రెండు రోజులు సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించిన అస్సాం
By: Sankar Fri, 26 June 2020 5:49 PM
దేశ వ్యాప్తంగా దాదాపు రెండు నెలలకు పైగానే కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో అన్ని రంగాలు ఎక్కడిక్కడ ఆగిపోయాయి ..దీనితో మధ్య తరగతి , పేద ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు ..అయితే కరోనా కేసుల సంఖ్య కంట్రోల్లోనే ఉండటంతో దేశంలో విడతల వారీగా లాక్ డౌన్ నుంచి సడలింపులు ఇచ్చారు ..అయితే ఒక్కసారిగా సడలింపులు స్టార్ట్ అయ్యాయో లేదో కరోనా కేసులు విజృంభించడం స్టార్ట్ అయింది ..దీనితో మల్లి రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధిస్తున్నారు ..తాజాగా అస్సాం లాక్ డౌన్ ను ప్రకటించింది ..
గత వారం రోజులుగా అస్సాం రాష్ర్టంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ కట్టడికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ర్ట వ్యాప్తంగా అత్యధికంగా కరోనా తీవ్రత ఉన్న గువాహటిలోని కమ్రప్ మెట్రోపాలిటన్ జిల్లాలో పూర్తి స్థాయి లాక్‌డౌన్ విధిస్తున్నట్లు రాష్ర్ట ఆరోగ్యశాఖ మంత్రి హిమంత బిస్వా శర్మ శుక్రవారం ప్రకటించారు. జూన్ 28 నుంచి రెండు వారాల పాటు లాక్‌డౌన్ ఉంటుందని తెలిపారు. దీని ప్రకారం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యకలాపాలతో సహా వాణిజ్య సముదాయాలు మూసివేయాలని ఆదేశించారు. కేవలం మెడికల్ షాపులు, ఆసుపత్రులు తెరవడానికి మాత్రమే అనుమతి ఉందని పేర్కొన్నారు.
అంతేకాకుండా వారాంతాల్లో ( శని, ఆదివారం ) అస్సాం రాష్ర్ట వ్యాప్తంగా పూర్తి స్థాయి లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని చెప్పారు. నేటి అర్ధరాత్రి నుంచి రాష్ర్ట వ్యాప్తంగా కర్ఫ్యూ నిబంధనలు అమల్లో ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు. దీని ప్రకారం రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు 12 గంటల కర్ఫ్యూ ఉండనుంది. అయితే పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించిన గువాహటిలో పరిమిత సంఖ్యలో బ్యాంకులకు అనుమతినిచ్చింది. అంతేకాకుండా అంత్యక్రియల్లో 20 మందికి మించి పాల్గొనరాదని ఉత్తర్వులో పేర్కొంది.