అమరవీరులకు తుది కన్నీటి వీడుకోలు
By: Sankar Wed, 11 Nov 2020 2:18 PM
జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఉగ్రమూకల కాల్పుల్లో అమరులైన వీర జవాను ర్యాడ మహేశ్ అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో నిర్వహించారు. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కోమన్‌పల్లి వైకుంఠ ధామంలో మహేశ్ అంత్యక్రియలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మహేష్ పార్థివ దేహంపై కుటుంబ సభ్యులు జాతీయ జెండాను ఉంచారు. అనంతరం సైనిక లాంఛనాల మధ్య అంత్యక్రియలు పూర్తి చేశారు. జవాన్‌కు తుది వీడ్కోలు పలకడానికి జనం పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా కోమన్‌పల్లి కన్నీటిసంద్రమైంది.
కాగా.. ఏపీలోని చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపల్లికి చెందిన మరో జవాన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో నిర్వహించారు. కుటుంబసభ్యులు కన్నీటితో ప్రవీణ్‌కు తుది వీడ్కోలు పలికారు. కాగా బుధవారం ఉదయం ప్రవీణ్ భౌతిక కాయాన్ని సందర్శించి ఎమ్మెల్యే ఎంఎస్ బాబు నివాళులర్పించారు.