స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేసిన ఏపీ హైకోర్ట్
By: Sankar Wed, 21 Oct 2020 5:04 PM
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించాలని, దీనిపై ప్రత్యేకంగా ఎలాంటి ఆర్డర్ అవసరంలేదని స్పష్టంచేసింది.
అయితే, తమను ఎన్నికల సంఘం సంప్రదించాలని ప్రభుత్వం పేర్కొంది. ప్రతీదానికి రాజ్యాంగ సంస్థ వచ్చి అడగాలా అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఏ విషయాల్లో సహకరించడంలేదో రాష్ట్ర ఎన్నికల సంఘం అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించడంలేదని కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వేసిన పిటిషన్‌ను బుధవారం విచారించిన సందర్భంలో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల నిర్వహణకు సహకరించేలా ఆదేశాలు జారీ చేయాలని నిమ్మగడ్డ హైకోర్టును ఈ సందర్భంలో కోరారు.
ఎన్నికల కమిషన్‌కు వైసీపీ ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల కమిషన్ నిర్వహణకు ఖర్చయ్యే నిధులను ప్రభుత్వం మంజూరు చేయకుండా నిలిపి వేసిందని నిమ్మగడ్డ రమేష్ ఆరోపించారు. ఎన్నికల సంఘం నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రాక ఇబ్బందులు పడుతున్నట్లు ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించడం లేదని రమేష్ కుమార్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.