హైదరాబాద్ లో మరొకరికి కొత్త వైరస్ పాజిటివ్ ...
By: Sankar Wed, 30 Dec 2020 10:49 AM
తెలంగాణ రాష్ట్రంలో బ్రిటన్ వేరియంట్ కరోనా వైరస్ మరో వ్యక్తికి సోకినట్లు తెలిసింది. వైద్య, ఆరోగ్య వర్గాల సమాచారం ప్రకారం జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉండే ఒక మహిళ ఈ యూకే కరోనా వైరస్ బారిన పడింది.
సీసీఎంబీలో నిర్వహించిన జీనోమ్ సీక్వెన్సీలో ఇది వెలుగు చూసినట్లు అధికారులు తెలిపారు. అయితే అటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ దీనిపై అధికారికంగా ఎలాంటి వివరాలు ప్రకటించడం లేదు. ఈ కొత్త కేసుతో రాష్ట్రంలో బ్రిటన్ వేరియంట్ కరోనా కేసులు రెండుకు చేరుకున్నాయి.
కాగా సోమవారం వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన ఒక 49 ఏళ్ల వయసున్న వ్యక్తికి బ్రిటన్ వేరియంట్ స్ట్రెయిన్ వచ్చినట్లు నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. అతను ప్రస్తుతం వరంగల్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని తల్లికి కరోనా సాధారణ పాజిటివ్ రావడంతో ఆమె శాంపిళ్లను కూడా జీనోమ్ సీక్వెన్సీ కోసం సీసీఎంబీకి పంపించారు. అయితే ఆ వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఒక్కరోజు వ్యవధిలోనే 2 కేసులు నమోదు కావడంతో వైద్య, ఆరోగ్యశాఖలో అలజడి మొదలైంది. కేసుల వివరాలను కేంద్రం ప్రకటించాలే కానీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధం లేదని చెబుతున్నారు.