ఇకపై పదోతరగతి వరకు టీసీ లేకున్నా ప్రవేశాలు
By: chandrasekar Thu, 05 Nov 2020 10:49 AM
కరోనా వల్ల చాలా మంది
ఆర్ధిక ఇబ్బందుల్లో ఉండడం వల్ల స్కూల్ ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు.
రాష్ట్రంలోని పాఠశాలల్లో ఇకపై టీసీ - ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ లేకున్నా
ప్రవేశాలు పొందవచ్చు. ఐదోతరగతి లోపు ఇప్పటివరకు టీసీ లేకున్నా ప్రవేశాలకు అవకాశం
ఉండగా, ఇకపై
పదోతరగతి వరకు టీసీ లేకున్నా ప్రవేశాలు కల్పించేలా విద్యా శాఖ ఏర్పాట్లు
చేస్తోంది. ప్రైవేటు పాఠశాలల్లో యాజమాన్యాలు ఫీజులు చెల్లిస్తేనే టీసీ ఇస్తామంటూ
మెలిక పెడుతుండటంతో తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత కరోనా
పరిస్థితులతో ప్రైవేటు పాఠశాలల్లో చదివించే ఆర్థిక స్తోమత లేని తల్లిదండ్రులు
ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించేందుకు సిద్ధమైనా టీసీ ఇవ్వాలంటే పాత
ఫీజులు, ఈ
విద్యా సంవత్సరపు ఫీజు చెల్లించాలంటూ యాజమాన్యాలు మెలిక పెడుతున్నాయి.
దీనివల్ల విద్యార్థుల
తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఈ నేపథ్యంలో విద్యాశాఖ టీసీ అవసరం లేకుండానే
పాఠశాలల్లో ప్రవేశానికి వీలు కల్పించాలని ప్రతిపాదనలను రూపొందించి ప్రభుత్వానికి
పంపించింది. త్వరలో ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ
సమాచారం. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయిలో టీసీ లేకున్నా
ప్రవేశాలు కల్పిస్తుండగా ఇప్పుడు ఉన్నత పాఠశాలల్లో మాత్రం టీసీ తప్పనిసరి నిబంధనను
అమలు చేస్తున్నారు. ప్రైవేటు స్కూళ్లలో అడ్మిషన్ కు అన్ని తరగతుల్లో టీసీ
అడుగుతున్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా బడులు ఇంకా ప్రారంభం కాలేదు. సెప్టెంబర్ 1 నుంచి
సర్కారు డిజిటల్ పాఠాలు ప్రారంభించింది.
ప్రస్తుతం ప్రజలు
ఇబ్బందుల్లో వున్నా కూడా కొన్ని ప్రైవేట్ స్కూళ్లు ఆన్‌లైన్ క్లాసులు
నిర్వహిస్తూ విద్యార్థుల నుంచి వందశాతం ట్యూషన్ ఫీజు వసూలు చేస్తున్నాయి. ఫీజులు
కట్టే స్తోమత లేని పేరెంట్స్ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు మార్చాలని
భావిస్తున్నారు. ఇందుకోసం టీసీలు కావాలని సదరు ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాన్ని
కోరితే ఫీజు మొత్తం కట్టాలని దబాయిస్తుండడంతో ఆయా పిల్లల తల్లిదండ్రులకు ఎటూ
పాలుపోలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఈ క్రమంలో కొందరు తల్లిదండ్రులు పాఠశాల
విద్యాశాఖ ఉన్నతాధికారులను ఆశ్రయించారు. దీనివల్ల ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలకు
తగిన షాక్ తగలనుంది.