విశాఖపట్నంకి అమ్మోనియం నైట్రేట్ వల్ల ఎలాంటి ప్రమాదం లేదని అధికారుల బృందం వెల్లడి
By: chandrasekar Mon, 10 Aug 2020 10:49 AM
అమ్మోనియం నైట్రేట్ వల్ల
విశాఖపట్నం నగరానికి ఎలాంటి ప్రమాదం లేదని అధికారుల బృందం వెల్లడించింది.
అమ్మోనియం నైట్రేట్ వల్ల భారీ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఓ
ప్రత్యేక బృందం విశాఖపట్నంలో ఆ పదార్థం నిల్వలను పరిశీలించింది. కలెక్టర్ వినయ్
చంద్ ఆదేశాల మేరకు మిందిలోని శ్రావణ్ షిప్పింగ్ సంస్థ గిడ్డంగిని అధికారులు, ఇంజినీర్లతో కూడిన బృందం పరిశీలించింది. ఆర్‌డీవో
కిశోర్, పీసీబీ ఈఈ సుభాన్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శంకర్‌రెడ్డి ఈ
బృందంలో ఉన్నారు.
విశాఖ పోర్టు ట్రస్ట్
చైర్మన్ కె.రామ్మోహన రావు మాట్లాడుతూ.. అమ్మోనియం నైట్రేట్ నిల్వలు గురించి విశాఖ
ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న
పుకార్లని ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. విశాఖ పోర్టులో గత దశాబ్దన్నర కాలం
నుంచి పూర్తి భధ్రతా ప్రమాణాలతో అమ్మోనియం నైట్రేట్‌ని ఉక్రేయిన్, రష్యా తదితర దేశాల నుంచి దిగుమతి చేస్తున్నాం
అన్నారు.
పరిశీలన అనంతరం మీడియాతో
అధికారులు మాట్లాడుతూ.. విశాఖలో 18,500
టన్నుల అమ్మోనియం నైట్రేట్ ఉందని వెల్లడించారు. దిగుమతి అయ్యాక ఈ గిడ్డంగి నుంచి
ఆయా ఏజెన్సీలకు సరఫరా అవుతున్నాయన్నారు. అలాంటి ఏజెన్సీలు మన రాష్ట్రంలో లేవని
చెప్పారు. 270
డిగ్రీల సెంటీగ్రేడ్ దాటాకే ఈ లవణం మండుతుందన్నారు. విశాఖకు అమ్మోనియం నైట్రేట్
ముప్పు లేదని అధికారులు స్పష్టం చేశారు. ముందు జాగ్రత్తగా మరింత లోతుగా
పరిశీలించాలని అగ్నిమాపక సిబ్బందికి సూచినట్లు చెప్పారు.