ఏపీలో స్కూల్స్ రీ ఓపెన్ ...8 తరగతిలో డెబ్బయి శాతం హాజరు
By: Sankar Mon, 23 Nov 2020 11:24 PM
పాఠశాలల్లో 8వ తరగతి విద్యార్థులు తొలి రోజే అత్యధిక సంఖ్యలో హాజరయ్యారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 2 నుంచి ఇప్పటివరకు 9, 10 తరగతులు మాత్రమే పాఠశాలల్లో బోధన జరిగిందన్నారు.
‘‘సోమవారం 46.28 శాతం 10వ తరగతి విద్యార్థులు హాజరయ్యారు. 9వ తరగతి విద్యార్థులు 41.61 శాతం హాజరయ్యారు. అయితే తరగతులు ప్రారంభించిన తొలిరోజే 8వ తరగతి విద్యార్థులు అత్యధికంగా 69.72 శాతం హాజరయ్యారు. మొత్తం 5,70,742 మంది విద్యార్థులకు 3,96,809 మంది హాజరయ్యారు..
గుంటూరు జిల్లాలో 82.34 శాతం అత్యధికంగా హాజరు కాగా విశాఖపట్నం జిల్లాలో తక్కువ శాతం 53.14 నమోదైంది. పాఠశాలల్లో కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ తరగతులు నిర్వహిస్తున్నాం. డిసెంబర్ 14 తరువాత 6,7 తరగతులు కూడా నిర్వహిస్తామని తెలిపారు. కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ పాఠశాలు, కళాశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులకు వైద్య పరీక్షలు చేస్తున్నామని పేర్కొన్నారు.