దివిసీమ ఉప్పెన విషాదానికి నేటితో 43 ఏళ్ళు
By: Sankar Thu, 19 Nov 2020 10:35 PM
దివిసీమ ఉప్పెన విషాదానికి 43 ఏళ్ళు పూర్తయ్యాయి. 1977 నవంబర్ 19.. ఈ తేదీ గుర్తొస్తే చాలు దివిసీమ వాసుల గుండె జలదరిస్తుంది. అంతటి విషాదాన్ని మిగిల్చిన దివిసీమ ఉప్పెనకు.. నేటితో సరిగ్గా 43 ఏళ్లు. కృష్ణాజిల్లా దివిసీమలో విధ్వంసం సృష్టించిన తుఫానును అతి భయంకరమైనది చెబుతారు.
అధికారికంగా 14 వేల 204 మంది, అనధికారికంగా సుమారు 50 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. దీనివల్ల అప్పట్లో సుమారు 172 కోట్ల రూపాయలు ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేశారు. భయంకరమైన ఈ తుఫాన్.. కృష్ణా డెల్టా ప్రాంతంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఆరు మీటర్ల ఎత్తున సముద్రపు అలలు ఎగసి పడ్డాయి. తుఫాన్ తర్వాత వందలాది శవాలు నీళ్ళలో తేలుతూ కనిపించాయి. గుర్తుపట్టలేనంతగా దెబ్బ తిన్న చాలాశవాలను సామూహిక దహనం చెయ్యాల్సి వచ్చింది.
వాల్తేరు కిరండల్ రైలు మార్గంలో కొండ రాళ్ళు జారి పడి, పట్టాలను ధ్వంసం చేశాయి. బాపట్లలో ఒక చర్చి కూలడంతో అక్కడ తలదాచుకున్న దాదాపు వందమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వరి పొలాలు, వాణిజ్య పంటలను ఉప్పెన ముంచెత్తింది. పదమూడు ఓడలు తుఫాన్‌లో చిక్కుకుని గల్లంతయ్యాయి. కృష్ణాజిల్లా పైనే కాదు గుంటూరు ప్రకాశం జిల్లా పై కూడా ఈ ఉప్పెన చాలా ప్రతాపం చూపింది. దాదాపు వంద గ్రామాలు తుఫాన్‌లో కొట్టుకుపోయాయి. 34 లక్షల మంది నిరాశ్రయులయ్యారు