ఉత్తరప్రదేశ్ బలరామ్‌పూర్‌లో గ్యాంగ్ రేప్ ఆరోపణలు... 22 ఏళ్ల దళిత యువతి మృతి
By: chandrasekar Thu, 01 Oct 2020 12:22 PM
హాథ్‌రస్ గ్యాంగ్‌రేప్
కేసు గురించి దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు ఇంకా చల్లారకముందే యూపీలోనే బలరాంపూర్‌లో
ఒక దళిత యువతిపై సామూహిక అత్యాచారం జరిగిందని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు
సమాచారం ఇచ్చారు.
బలరాంపూర్ పోలీసులు
ట్విటర్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు. తమ పోలీస్ స్టేషన్ పరిధిలోని గేసడిలో ఈ ఘటన
జరిగినట్లు ఫిర్యాదు వచ్చిందని చెప్పారు.
“ఫిర్యాదులో ఒక 22 ఏళ్ల యువతి కుటుంబ
సభ్యులు, ఆమె ఒక ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నారని చెప్పారు.
మంగళవారం బాగా చీకటిపడినా ఆమె పని నుంచి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఫోన్
చేసినా తీయలేదు. కాసేపటి తర్వాత ఆ యువతి ఒక రిక్షాలో ఇంటికి వచ్చారు. ఆమె చేతికి
గ్లూకోజ్ ఎక్కించినప్పుడు వేసే పట్టీ ఉంది. ఆమె పరిస్థితి దారుణంగా ఉంది. కుటుంబ
సభ్యులు ఆమెను వెంటన్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అక్కడికి చేరేలోపే యువతి
చనిపోయారు” అని పోలీసులు ఆ వీడియోలో చెప్పారు.
“దీనిపై ఫిర్యాదు చేసిన యువతి కుటుంబ సభ్యులు ఇద్దరి
పేర్లు చెప్పారు. వారిద్దరూ ఆమెను ఏ డాక్టరు దగ్గరకో తీసుకెళ్లి చికిత్స
చేయించారు. యువతిపై అత్యాచారం చేశారు. ఆమె పరిస్థితి ఘోరంగా మారడంతో ఆమెను
ఆస్పత్రికి తీసుకెళ్లకుండా ఇంటికి పంపించేశారని చెప్పార”ని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించి
పోలీసులు నిందితులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వారిని
అరెస్ట్ చేశామని, దర్యాప్తు పూర్తైన తర్వాత వేరే ఎవరైనా నిందితులుగా
తేలితే, వారిని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పారు.
ఈ ఘటనలో నిందితులు యువతి
చేతులు, కాళ్లు, నడుము విరగ్గొట్టారని కూడా కొన్ని మీడియా
రిపోర్టుల్లో చెబుతున్నారు.