ఆడవారిని అమితంగా ఆకర్షించే పోచంపల్లి చీర
By: chandrasekar Fri, 19 June 2020 7:46 PM
పోచంపల్లి చేనేత
కళాకారులు నిలువు పేకల మగ్గంపై నేసిన చేనేత కళాఖండాలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి
గుర్తింపు ఉంది. తెలంగాణ రాష్ట్ర రాజధానికి 35కిలోమీటర్ల
దూరంలో ఉన్న పోచంపల్లి చేనేతకు ప్రసిద్ధి చెందింది. అక్కడి చేనేత కార్మికులు నేసిన
చీరలు అందరినీ మురిపిస్తాయి. ఇక ఆడవారినైతే అమితంగా ఆకర్షిస్తాయి.
సాధారణ స్త్రీల నుండి దేశ
విదేశీ వనితల వరకూ అందరినీ ఆకట్టుకునే చేనేత ఉత్పత్తులు, చీరలతో ఖండాంతర ఖ్యాతిని పోచంపల్లి పొందింది. అనాడు
అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరను నేసిన నేతన్నలు ప్రస్తుతం అనేక డిజైన్లలో చేనేత
బట్టలను నేసి, అందరినీ
ఆకర్షించేలా చేస్తున్నారు.
గుజరాత్, ఒరిస్సా రాష్ట్రాలలో వలె ఇక్కాత్ నేతకు తెలంగాణ
రాష్ట్రంలోని ఈ ప్రాంతం ప్రసిద్ధమైనది. పోచంపల్లి ఇక్కత్ నేతలో టైయింగ్, ఇంకా డైయింగ్ అనే ప్రక్రియలో 18 అంకాలుంటాయి. నేసేముందు బండిళ్లకొద్దీ దారానికి
రంగులద్దుతారు. పోచంపల్లి నేతలో ఉండే ప్రత్యేకత ఏంటంటే, వార్ప్, ఇంకా
వెఫ్ట్ మీదకు పోచంపల్లి డిజైన్ను దింపుతారు.
నేయబోయే బట్ట డిజైన్ రంగు
అద్దిన దారాల్లో కనిపిస్తుంది. ముందుగా ముడి పట్టును డీగమ్ చేస్తారు అంటే అందులో
ఉన్న పట్టుపురుగులు వదిలే సెరిసిన్ అనే ఒక ప్రోటీన్ను పట్టు నుంచి తీసేస్తారు. అలా
దాన్నుంచి గమ్ తీసేయడం వలన పట్టుకు మెరుపు వస్తుంది. రంగు మెరుగుపడుతుంది. తర్వాత
పట్టును కండెల నుంచి బాబిన్లకు ఎక్కిస్తారు.
కళాకారుడి నైపుణ్యం
చూడాలంటే కండెల నుంచి బాబిన్లకు పట్టును ఎక్కించేటప్పుడు చూడాలి. బాబిన్లకు
చుట్టిన తర్వాత అంకం టై అండ్ టై ఫ్రేమ్ మీద వార్ప్ అండ్ వెఫ్ట్ను సిద్ధం
చేసుకోవడం. ఇక్కత్ ఒకరకమైన నేత. దాంట్లో వార్ప్ చీర మీద డిజైన తయారు చేసి
నేయడానికి ముందు టై అండ్ డై చేస్తారు. ముందుగా సిల్కును బ్లీచింగ్ చేసి ఆరబెడతారు.
చిక్కులుగా ఉన్న పట్టుదారాల నుంచి ఒక్కో పోగును తీసుకని రాట్నంపై వడుకుతారు.
అలా వడికిన పట్టను మొత్తం
కండెలకు చుడతారు. కండెల నుంచి దారమంతా ఆసు పోస్తారు. ఎంపిక చేసుకున్న డిజైన్ ను
ఆసుపై పోస్తారు. చిటికి ద్వారా డిజైన్ చేస్తూ రబ్బరుతో ముళ్లు వేసి కావలసిన రంగులు
అద్దుతూ అందమైన వస్త్రాలను నేస్తారు. 1953 లో
తొలిసారిగా పోచంపల్లిలో తొలిసారిగా ఇక్కత్ కళ స్టార్టైంది. కర్నాటి అనంతరాములు అనే
పెద్దాయన గుజరాత్ లోని బెనారస్ వెళ్లి ట్రైనింగ్ తీసుకుని సిల్క్ తో ఇక్కత్ కళను
వెలుగులోకి తెచ్చాడు. ఇక్కత్ కళకు 2003 లో
భారత ప్రభుత్వం నుంచి పేటెంట్ హక్కులు లభించాయి.
ఇక్కడ ఉత్పత్తి జరిగే
చేనేత చీరలు 2వేల రూపాయల నుంచి యాబై, అరవై వేల రూపాయల వరకు ధర పలుకుతుందంటే నమ్మశక్యంగా
ఉండదు. టాలీవుడ్, బాలీవుడ్
నుంచి ప్రముఖ సినీతారలు, రాజకీయ
నాయకులు, ఇతర దేశాల నుంచి విచ్చేసిన మహిళలు సైతం పోచంపల్లి
చేనేత కార్మికులు తయారుచేసిన చీరలవైపు మక్కువ చూపడం విశేషం.
తెలంగాణ గాంధీగా
పిలుచుకునే కొండా లక్ష్మణ్ బాపూజీ చొరవతో చేనేత సహకార సంఘాలు ఏర్పాటు కావడంతో
పోచంపల్లి చేనేత పరిశ్రమ కేవలం పోచంపల్లికే పరిమితం కాకుండా జిల్లాలోని చౌటుప్పల్, కొయ్యలగూడెం, పుట్టపాక, గట్టుప్పల్, సిరిపురం, ఎల్లంకి, రామన్నపేట, నాగారం, బోగారం
గ్రామాలకు విస్తరించడంతోపాటు వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాలో కూడా అనేక మంది కార్మికులకు
పోచంపల్లి డిజైన్ చీరలు ఉపాధి కల్పించే పరిస్థితి నెలకొంది.
ఇక్కడి చేనేత టైఅండ్డై
అసోసియేషన్, చేనేత
సహకార సంఘం ఎంతో కృషి చేసి 30రకాల
డిజైన్లకు పేటెంట్ హక్కు కల్పించాలని జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ కి
పలుమార్లు విన్నవించింది. కానీ, కేవలం 11రకాల డిజైన్లకు మాత్రమే పేటెంట్ హక్కును
కల్పించేందుకుగాను 1999లో
గుర్తించి 2000లో
పేటెంట్ హక్కును కల్పించారు.
దేశచరిత్రలో కార్మికుడు
సాధించిన ఘన విజయంగా దీనిని పేర్కొనవచ్చు. పోచంపల్లి చీరకు 2005లో భౌగోళిక గుర్తింపు, జాగ్రఫికల్ ఇండికేషన్ లేదా ఇంతలెక్చుయల్ రైట్స్
ప్రొటెక్షన్ లభించింది. పోచంపల్లి లో తయారైన ఇక్కాత్ శైలి పోచంపల్లి చేనేత సహకార
సంస్థ లిమిటెడ్, పోచంపల్లి
హాండ్లూం టై అండ్ డై సిల్క్ సారీస్ తయారీ అసోసియేషన్ యొక్క రిజిస్టర్డ్
ప్రోపర్టీగా గుర్తింపబడినది.