షూటింగ్ మార్గదర్శకాలు విడుదల చేసిన తెలంగాణ సర్కార్
By: Sankar Wed, 10 June 2020 09:23 AM
లాక్‌డౌన్ కారణంగా రెండు నెలలకుపైగా నిలిచిపోయిన సినిమా, టీవీ షూటింగులకు ప్రభుత్వం అధికారికంగా అనుమతులు జారీచేసింది. మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ కారణంగా సినీ పరిశ్రమలో షూటింగ్‌లు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఇటీవల సడలింపులిచ్చినా.. సినీ పరిశ్రమకు మాత్రం అందులో ఊరట దక్కలేదు. సినీ పెద్దల వినతితో తెలంగాణ సర్కారు షరతులతో షూటింగులు, నిర్మాణానంతర పనులు చేసుకోవచ్చని మంగళవారం అధికారికంగా మార్గదర్శకాలు జారీ చేసింది.
1 నిర్మాణానంతర పనులైన డబ్బింగ్, ఎడిటింగ్, సౌండ్‌మిక్స్, విజువల్
ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్, స్క్రిప్టు రైటింగ్ వంటివి చేసుకోవచ్చు. కనిష్టంగా
ఇద్దరి నుంచి గరిష్టంగా పదిమందికి మించకూడదు. వీరంతా మాస్కు, శానిటైజర్,
భౌతికదూరం తప్పక పాటించాలి.
2 చిత్ర/నిర్మాణ ప్రాంగణంలో రోజూ థర్మల్ స్క్రీనింగ్ చేయాలి. కరోనా సేఫ్టీ గైడ్‌లైన్స్ విధిగా పాటించాలి.
3 సినీ కార్యాలయాల్లో పరిసరాలను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలి.
4 సభ్యుల ఆరోగ్యంపై నిర్మాత హెల్త్ డిక్లరేషన్ ఇవ్వాలి. అంతా విధిగా మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించాలి.
5 కలిసి భోజనం చేయడం, తినుబండారాలను పక్కవారితో పంచుకోవడం కూడదు.
6 బయటివారిని అనుమతించకూడదు. సభ్యులందరికీ చేతులు శుభ్రం చేసుకునేందుకు శానిటైజర్, సోప్ తదితర సౌకర్యాలను విధిగా కల్పించాలి.