హిందీలో అవకాశాలు లేనంత మాత్రాన కెరీర్ ముగిసినట్లు కాదు
By: chandrasekar Mon, 07 Sept 2020 3:33 PM
చెన్నై సొగసరి శృతిహాసన్..జీవితాన్ని యథాతథంగా తీసుకోవాలన్నదే తాను నమ్మే సిద్ధాంతమని చెబుతోంది. మరొకరి అంచనాలు, ఆకాంక్షలకు తగినట్లుగా తాను జీవితాన్ని సాగించలేనని, సినిమా తన జీవితంలో ఓ భాగం మాత్రమేనని తెలిపింది. హిందీ చిత్ర పరిశ్రమలో అవకాశాలు లేనంత మాత్రాన కెరీర్ ముగిసినట్లు కాదని.. తమిళ, తెలుగు భాషలే తన మొదటి ప్రాధాన్యతనిస్తాను అని చెప్పింది శృతిహాసన్. ఆమె మాట్లాడుతూ ‘ముంబయిలో పరిస్థితులు విచిత్రంగా ఉంటాయి. ఏడాది పాటు ఖాళీగా ఉంటే కెరీర్ ముగిసిపోయిందని, అంకితభావంతో పనిచేయడం లేదని విమర్శలు వస్తాయి.
నేను విభిన్న భాషల్లో సినిమాలు చేస్తున్నాను. బాలీవుడ్ అందులో ఒకటి మాత్రమే. తమిళం, తెలుగు నాకు రెండు కళ్లతో సమానం. కెరీర్ విషయంలో ఎవరి సలహాలు తీసుకోను. ఆత్మసాక్షి మేరకే నడచుకుంటా. నా మనసుకు నచ్చిన సినిమాలే చేస్తుంటాను. విజయం దక్కితే సంతోషిస్తా. పరాజయం పాలైతే ఓ పాఠంగా తీసుకుంటా. అంతే కానీ కెరీర్‌కు ఏదో అవుతుందని ఆందోళన చెందను. సినిమా కాకుండా నేను ఆనందించే జీవితం చాలా ఉంది’ అని చెప్పుకొచ్చింది శృతిహాసన్.