Advertisement

రుణాల కోసం పసిడి వైపే మొగ్గు చూపుతున్న ప్రజలు

By: Sankar Wed, 10 June 2020 8:00 PM

 రుణాల కోసం పసిడి వైపే మొగ్గు చూపుతున్న ప్రజలు

భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమొ అందరికి తెలిసిందే. పసిడి మన సంస్కృతిలో అంతర్భాగమని నిపుణులు చెబుతుంటారు. కరోనా వైరస్‌ విలయతాండవంతో దేశ వ్యాప్తంగా ప్రభుత్వం లాక్‌డౌన్‌ అమలు చేస్తుంది. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కి తిరిగి వ్యాపారంలో పుంజుకునేందుకు ప్రజలు బంగారు రుణాల వైపు మొగ్గు చూపుతున్నట్లు బ్యాంక్‌ అధికారులు తెలిపారు. బ్యాంక్‌లు కూడా వివిధ ఆస్తుల గ్యారెంటీ కన్నా బంగారు రుణాలే మేలని భావిస్తున్నాయి. దేశంలో బంగారు రుణాలవైపు ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు క్రెడిట్‌ రేటింగ్ ఏజెన్సీ క్రెసిల్ పేర్కొంది.‌

వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి, ఎక్కువ శాతం ప్రజలు బంగారు రుణాలు తీసుకోవడానికి సానుకూలంగా ఉన్నట్లు వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ హెడ్‌ పీఆర్‌ సోమ సుందరం పేర్కొన్నారు. కాగా దేశంలోని ప్రజలు సగటున (రూ.40,000) బంగారు రుణాలు తీసుకుంటున్నట్లు ముథుట్ ఫైనాన్స్ మేనేజింగ్ డైరెక్టర్ జార్జ్ అలెగ్జాండర్ ముథూట్ తెలిపారు. బంగారు రుణాలు ఇవ్వడానికే తమ బ్యాంక్‌ ప్రాధాన్యమిస్తున్నట్లు ఫెడరల్ బ్యాంక్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అశుతోష్ ఖాజురియా పేర్కొన్నారు.

వ్యక్తిగత రుణం తీసుకోవాలని భావిస్తే అందుకు ఎంతలేదన్నా కనీసం రెండు మూడు రోజుల సమయం తీసుకుంటుంది. మధ్యలో సెలవు రోజు ఉంటే ఇంకా ఒకటి రెండు రోజుల అదనపు సమయం తీసుకోవచ్చు. కానీ, బంగారంపై రుణానికి ఇంత సమయం వేచి ఉండక్కర్లేదు. మీ వద్దనున్న బంగారం, ఆధార్‌ కార్డు, మీ చిరునామా వివరాలతో ఎన్‌బీఎఫ్‌సీ సంస్థను ఆశ్రయిస్తే అరగంట నుంచి గంటలోపే రుణంతో తిరిగి వెళ్లిపోవచ్చు. ముత్తూట్‌ ఫైనాన్స్‌ అయినా మణప్పురం ఫైనాన్స్‌ అయినా గంటలోపే ప్రాసెస్‌ చేస్తున్నాయి.

Tags :
|
|
|
|

Advertisement