Advertisement

‘కృష్ణ-కుచేల స్నేహం

By: chandrasekar Thu, 02 July 2020 7:45 PM

‘కృష్ణ-కుచేల స్నేహం


పరమాత్మ అనుగ్రహాన్ని పొందడానికి చూపించే నవవిధ భక్తుల (శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం లేదా స్నేహం, ఆత్మనివేదనం)లో స్నేహభక్తి ఒకటి. భగవంతునితో స్నేహం చేసి, దానితో సమానంగా భక్తిని ప్రదర్శించగలగడం అందరివల్లా అయ్యే పనికాదు. దీనిలో అద్భుత విజయం సాధించిన ఏకైక పౌరాణిక పురుషోత్తముడు కుచేలుడు. ‘కృష్ణ-కుచేల స్నేహం’ లోకానికే ఆదర్శం. స్నేహానికి ‘పేద-ధనిక భేదం’ లేదని ఈ కథ చాటుతున్నది.

కృష్ణ-కుచేలుల స్నేహం ఎంత ప్రాణప్రదమో అంత పవిత్రం. అది విడదీయరానిది. వారి నడుమ స్వార్థానికి తావుండదు. అడిగిన తర్వాతే ఇచ్చేవారు సామాన్యులు. అడక్కుండా ఇచ్చేవారు గొప్పవారు. కృష్ణుడిది అంతటి గొప్పస్నేహం.

కుచేలుని నిర్మల మనసు తెలిసిన నేస్తం ఆ పరంధాముడు. సాందీప మహర్షివద్ద బాల్యమిత్రులుగా విద్య నేర్చుకొని గురువుకు గొప్పపేరు తేవడమే కాక స్నేహానికి వన్నె తెచ్చారు కృష్ణ-కుచేలులు. కుచేలుని అసలు పేరు సుధామ. ‘కుత్సితః చేలః కుచేలః’. ఆయన చినిగిన బట్టలు గలవాడు. కటిక పేదరికం. విద్య ముగిసాక గృహస్థుడైనాడు. గుణవతి, శీలవతి, అనుకూలవతి అయిన భార్య లభించింది.

సంతానానికి కొదువ లేదు. కానీ, దరిద్రానికి ఆకలెక్కువ కదా! అంత పెద్ద కుటుంబాన్ని పోషించుకోలేని దుర్భర పరిస్థితి. కాలం ఎంత పరీక్ష పెట్టినా గోవింద నామస్మరణను మాత్రం కుచేలుడు మానలేదు. ఒకానొక సంక్లిష్ట పరిస్థితిలో కుచేలునితో భార్య, ‘మీ బాల్యమిత్రుడైన శ్రీకృష్ణుని దర్శనానికి వెళ్లండి’ అని ప్రాధేయపూర్వకంగా సూచిస్తుంది. ‘అప్పుడు మన దారిద్య్రం తొలగే మార్గం లభించవచ్చు’ అన్నది ఎంతో ఆశగా. కుచేలుడూ ‘చిన్ననాటి మిత్రుణ్ణి కంటినిండా చూసుకోవచ్చన్న’ ఆనందంతో భార్య మాటను కాదనలేకపోయాడు.

krishna,kucheila,friendship,god,money , కృష్ణ ,కుచేల, స్నేహం,


తక్షణమే కొన్ని అటుకులు భర్త కండువా కొసకు కట్టిచ్చింది. కృష్ణ నామస్మరణతోనే కృష్ణుని భవనంలోకి ప్రవేశిస్తాడు. ‘ద్వారపాలకులు తనను లోపలకు వెళ్లనిస్తారో లేదోనని’ అనుమాన పడుతుండగా, అనుకొన్నంతా జరిగింది. అక్కడి వారు అడ్డుకొన్నారు. ఎలా తెలిసిందో ఏమో స్వయంగా కృష్ణుడే అక్కడకు వచ్చి, స్వయంగా కుచేలుణ్ణి తోడ్కొని వెళతాడు. తన్మయత్వంతో కౌగిలించుకొంటాడు. తన మృదుతల్పంపై కూర్చోపెట్టుకొంటాడు.

రుక్మిణీ సమేతంగా బాల్యమిత్రుడైన ఆ నిరుపేద బ్రాహ్మణునికి అర్ఘ్య పాద్యాలతో కాళ్లు కడుగుతాడు. ‘నమోస్తనంతాయ సహస్రమూర్తయే సహస్ర పాదాక్షి శిరోరు బాహవే’ అంటూ ఆ నీటిని కృష్ణ దంపతులిద్దరూ తమ శిరస్సులపై చల్లుకొంటారు. అతిథి పూజ చేస్తారు.షడ్రసోపేతమైన భోజనం వడ్డిస్తారు. కృష్ణుడిని చూసిన ఆనందంలో కుచేలుడు వచ్చిన పనినేమరిచి పోతాడు. తనపట్ల చూపుతున్న ఆదరణకు ఉబ్బితబ్బిబ్బవుతాడు. నోట మాటలు రానంత తన్మయత్వంలో మునిగిపోతాడు. స్నేహభక్తిలో పరాకాష్ట తప్ప మరేదీ కోరుకోని నిష్కామయోగి కుచేలుడు. నోరు తెరచి ఏమీ అడగకున్నా, అన్నీ తెలిసిన పరంధాముడు మిత్రునికి ఎంత వైభవం ఇవ్వాలో అంతా ఇచ్చాడు. కుచేలుడు ఇల్లు చేరేసరికి అతని పూరిగుడిసె స్థానంలో పెద్ద భవనమే వెలసింది.

Tags :
|

Advertisement