జలపాతాలతో కనువిందు చేసే 'దక్షిణాది చిరపుంజి 'అగుంబే



కర్ణాటకలోని షిమోగా జిల్లాలో మూడు చదరపు కి.మీచిన్న గ్రామం అగుంబే. జనాభా దాదాపు ఐదువందలు. పక్షుల కిలకిలలు తప్ప పట్టణ ప్రాంతపు రణగొణధ్వనులేవీ ఇక్కడ వినిపించవు. పడమటి కనుమల్లో పుష్కలంగా వర్షాలు కురిసే ప్రదేశం ఇది. అందుకే పచ్చదనానికి చిరునామాలా ఉంటుంది. అగుంబె ఈ ప్రదేశాన్ని దక్షిణ భారతదేశపు చిరపుంజి అని పిలుస్తారు. పశ్చిమ కనుమలకలోని ఈ ప్రదేశంలో జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో అత్యధిక వర్షపాతం పడుతుంది.

ఈ మాన్సూన్ సీజన్‌లో అడవి మొత్తం పొగమంచుతో ఉంటుంది. వాటర్‌ఫాల్స్ కనువిందు చేస్తా యి. కుంచికల్ ఫాల్స్, బర్కానా ఫాల్స్ అందాలు తనివితీరా చూడాల్సిందే. ఇక్కడున్న అగుంబె రెయిన్‌ఫారెస్ట్ రీసెర్చ్ స్టేషన్‌ను ప్రతి ఒక్కరు సందర్శించాల్సిందే. అగుంబె చుట్టుపక్కల ముఖ్యంగా చూడాల్సినవి ఇక్కడి జలపాతాలనే. కొండల మీదుగా నేల మీదకు ఉరికే జలపాతాలు ఇక్కడ అడుగడుగునా తారసపడతాయి. ముఖ్యంగా బర్కానా జలపాతం, కూడ్లుతీర్థ జలపాతం, జోగిగుండి తదితర జలపాతాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి..

వర్షాలు ఎక్కువగా పడే ప్రాంతం కాబట్టి ఇక్కడ చాలా జలపాతాలు సహజంగా ఏర్పడ్డాయి. వాటిలో ఒకటి కుంచికాళ్ జలపాతం. ఇది ఇక్కడి టూరిస్టులకు మరో అట్రాక్షన్. ఇది దేశంలోనే ఎక్కువ ఎత్తు నుంచి పడుతున్న జలపాతాల్లో ఒకటి. ఇది 1493 అడుగుల ఎత్తు నుంచి పడుతూ చూసేవాళ్లకి చిన్నపాటి నయాగరాలా అనిపిస్తుంది. వారాహి నది ఇక్కడే పుడుతుంది.

మరో జలపాతం బర్కానా. ఇది 850 అడుగుల ఎత్తు నుంచి పడుతుంది. సీతానది కొండలపై నుంచి ప్రవహిస్తుంది కాబట్టి దీనికి సీతా జలపాతం అనే పేరు కూడా ఉంది. ఈ జలపాతాన్ని చేరాలంటే గుంబో ఘాట్ల ద్వారా ట్రెక్కింగ్ చేయాలి లేదా బైక్ రూట్లో వెళ్లాలి.


అగుంబెకు దగ్గర్లో ఉండే మరో జలపాతం ఒనకి జలపాతం. కన్నడలో ఒనకి అంటే దంపుడు కర్ర అని అర్థం. ఈ జలపాతం చూడ్డానికి అలాగే కనిపిస్తుందని ఆ పేరు పెట్టారు. మెట్ల ద్వారా అక్కడికి చేరుకోవచ్చు.

ఇక్కడికి మూడు కిలో మీటర్ల దూరంలో జోగి గుండి జలపాతాలు ఉంటాయి. ఇవి చాలా పురాతనమైనవి. సుమారు 829 అడుగుల ఎత్తునుంచి పడతాయి. ఇక్కడకు చేరుకోవాలంటే సగం దూరం బైక్ లేదా కార్లో వెళ్లి మిగిలిన దూరం ట్రెక్కింగ్ చేయాలి.

ఇక్కడ చూడాల్సిన ప్రదేశాల్లో అగుంబె రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ స్టేషన్ ఒకటి. ఏడాది మొత్తంలో 7 వేల మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అగుంబేలోని అడవుల వైవిధ్యంపై ఇక్కడి శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తూ ఉంటారు. వాటి విశేషాలను ఇక్కడ తెలుసుకోవచ్చు.