అంతుచిక్కని పూరి జగన్నాథ ఆలయ అద్భుతాలు

పూరీ జగన్నాథ్ ఆలయానికి హిందూ భక్తుల్లో ప్రత్యేక స్థానం ఉంది. దేశంలోనే ప్రసిద్ధ చార్ ధామ్ క్షేత్రాల్లో ఇది ఒకటి. ఇక్కడ ప్రతి ఏటా నిర్వహించే రధయాత్రకు దేశ విదేశాల నుంచి లక్షలాది సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు. శ్రీ మహావిష్ణువు కలలో కనిపించి ఆదేశించిన ప్రకారం ఇంద్రద్యుమ్న మహరాజు పూరీ ఆలయాన్ని నిర్మించినట్లు పురాణ కధనం. పాండవులు యమరాజు వద్దకు తమ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు మోక్షానికి చేరువ చేసే చార్ ధామ్ క్షేత్రాల్లో ఒకటైన పూరీ జగన్నాధ్ ఆలయాన్ని దర్శించుకున్నారట. సైన్స్ కు కూడా అంతుచిక్కని రహస్యాలతో ఈ ఆలయం ముడిపడి ఉన్నట్లు చెబుతారు. ఇంతకీ ఆ రహస్యాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

పూరీ జగన్నాధ్ ఆలయంపై ఎప్పుడూ హిందూ మతం చిహ్నాలతో కూడిన జెండాలు కనిపిస్తాయి. ఇందులో ఆశ్చర్యం ఏం ఉంది అనుకోకండి. అసలు రహస్యం ఇక్కడే ఉంది. ఈ జెండాలు గాలి వీచే దిశలో కాకుండా వ్యతిరేక దిశలో రెపరెపలాడుతూ ఉంటాయి. దీని వెనుక రహస్యం శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోయారు.


20 అడుగుల ఎత్తు, టన్ను బరువు గల సుదర్శన చక్రాన్ని పూరీ జగన్నాధ్ ఆలయ పై భాగాన ఏర్పాటు చేశారు. ఆశ్చర్యకర విషయం ఏమిటంటే పూరీ పట్టణంలో ఏ మూల నుంచి చూసినా ఈ సుదర్శన చక్రం కనిపిస్తుంది. ఆలయంపైన ఈ చక్రాన్ని ఉంచిన తీరు ఒక ఇంజినీరింగ్ మిస్టరీగానే మిగిలిపోయింది. ఏ వైపు నుంచి మీరు దీనిని చూసినా అది మీకు అభిముఖంగానే ఉన్నట్లు కనిపించడం విశేషం.

ఈ ఆలయంపై నుంచి విమానాలు, పక్షులు ఎగరకపోవడం ఆశ్చర్యకర విషయం. దేశంలోని ఏ ఆలయంలోనూ ఇటువంటి అంశం కనిపించడం అరుదు. ఏ ప్రభుత్వమూ దీనిని నో ప్లయింగ్ జోన్ గా ప్రకటించలేదు. ఏదో తెలియని అతీత శక్తి కారణంగా ఇది నో ఫ్లయింగ్ జోన్ గా పరిగణింపబడుతుంది. దీనికి ఇప్పటికీ శాస్త్రీయ వివరణ లేకపోవడంతో రహస్యంగానే మిగిలిపోయింది.