ఏకైక ఉప్పునీటి సరస్సుగా పేరుగాంచిన లోనార్‌ సరస్సు

చుట్టూ పచ్చని పచ్చికబయిళ్లతో నిండిన దట్టమైన అడవి. ఎక్కడ విన్నా పక్షుల కిలకిలరావాలే. అయితే అది పూర్తి శిలా ప్రాంతం. అలాంటి ప్రాంతంలో ఏర్పడ్డ ఏకైక ఉప్పునీటి సరస్సుగా పేరుగాంచింది లోనార్‌ సరస్సు. లోనార్‌ గ్రామంలో ఉన్న ఈ గొయ్యి 52 వేల ఏళ్ల క్రితం భూమిని తాకిన ఉల్కాపాతం వల్ల ఏర్పడిందని ఖగోళశాస్త్రవేత్తల అంచనా. ఈ సరస్సు మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలోని బుల్దానా జిల్లాలో ఉంది.

ప్రస్తుతం వివిధ జాతుల పక్షులతో సందర్శకులను కట్టిపడేసే దట్టమైన అడవులు ఈ గొయ్యి చుట్టూ ఏర్పడ్డాయి. బాతులు, గుడ్లగూబలు, నెమళ్ళు వంటి పక్షులను దీని పరిసర ప్రాంతాలలో గమనించవచ్చు. అయితే, ఈ సరస్సు ఎలాంటి వృక్ష, జలచరాల మనుగడకు అనువైనది కాదు. నివాసయోగ్యమూ కాదనే చెప్పాలి.

సాయంత్ర సమయాల్లో సూర్యుడు అస్తమించే ముందు దీన్ని చూడాలి. దగ్గరలోని లోనార్‌ సరోవర్‌ చాలా ఔషధ, సుగంధ మొక్కలకు, పొదలకు నెలవు. విశ్వ రహస్యాల గురించి ఆసక్తి గల యాత్రీకులు, ఖగోళశాస్త్రం లేదా సామాన్యశాస్త్రంపై మక్కువ ఉన్నవారు వారి జీవితంలో ఒక్కసారైనా తప్పనిసరిగా ఈ ప్రాంతాన్ని సందర్శించాల్సిందే! ఔరంగాబాద్‌ నుంచి 150 కిలోమీటర్లు, ముంబయి నుంచి 450 కిలోమీటర్ల దూరంలో ఈ సరస్సు ఉంది.