గుల్మార్గ్‌ అంటే పూలదారి


కాశ్మీర్ ‌లోని అందమైన ప్రాంతాల్లో ఇదీ ఒకటి. బారాముల్లా జిల్లాలోని గుల్మార్గ్‌లో పర్యాటకు తాకిడి ఎక్కువగా ఉంటుంది. గుల్మార్గ్‌ అంటే పూలదారి అని అర్థం. శీతాకాలంలో మాత్రం ఈ ప్రాంతంలోని దారులన్నీ మంచుతో నిండి ఉంటాయి. ఇళ్లపైకప్పులపైకి పాకిన తీగలు పూలతో కనువిందు చేస్తాయి. ఆ చోటులలో కూడా మంచు తిష్టవేస్తుంది.

ఆరుబయట, ఆపిల్‌ తోట అంతటా మంచే. అక్కడున్న వాళ్ల సంగతేమో కానీ, ఈ ముచ్చటను చూసేందుకు పర్యాటకులు గుల్మార్గ్‌ బాట పడతారు. స్కేటింగ్‌, స్కీయింగ్‌ ఆటలు ఉంటాయి. జారుడు పలకలపై కూర్చుని దూసుకుపోయే స్లెడ్జింగ్‌ విన్యాసాలు పర్యాటకులకు క్షణం తీరిక లేకుండా చేస్తాయి. గుల్మార్గ్‌లో కేబుల్‌కారు ప్రత్యేక ఆకర్షణ. దీనిని గొండోలా రైడ్‌ అంటారు.


గుల్మార్గ్‌ నుంచి ఆఫర్వాట్‌ పర్వత శిఖరంపైకి కేబుల్‌ కారులో చేరుకోవచ్చు. మంచుతెరలను తోసుకుంటూ అయిదు కిలోమీటర్లు సాగే కేబుల్‌ కారు ప్రయాణం హిమాలయాల సౌందర్యం కళ్ల ముందు ఆవిష్కరిస్తుంది. పార్కులు, పర్యాటక కేంద్రాలు సరేసరి. స్థానికుల ఆతిథ్యం, కాశ్మీరులు మరచిపోలేని అనుభూతినిస్తాయి.


ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు విమానంలో వెళ్లి అక్కడి నుండి బస్సులు, టాక్సీల్లో గుల్మార్గ్‌ చేరుకోవచ్చు. హైదరాబాద్‌, తిరుపతి, విజయవాడ నుంచి జమ్మూతావికి రైళ్లు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి గుల్మార్గ్‌కు బస్సులు, టాక్సీలు ఉంటాయి.