ఆహ్లదకరమైన అరకు లోయ విశేషాలు



మంచుదుప్పటి కప్పుకున్న గిరుల సోయగాలు, చినుకు తడికి మెరిసిపోయే పచ్చదనం, గిరిజన జీవన విధానాన్ని ప్రతిబింబించే పోడు వ్యవసాయ పద్ధతులు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రత్యేకతలు, మరెన్నో విశేషాలు. మరపురాని అనుభూతులను పంచే పర్యాటక స్వర్గధామం 'అరకులోయ' అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన నగరమైన విశాఖపట్నం సందర్శనకు వచ్చే టూరిస్టులెవరైనా అరకులోయను సందర్శించకుండా వెళ్లరు. నగర పర్యటన ముగించుకున్న తరువాత హిల్ స్టేషన్ కు పయనమయ్యేందుకు అధికశాతం టూరిస్టులు ఆసక్తి చూపుతారు. విశాఖపట్నం నగరానికి 114 కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో అరకులోయ హిల్ స్టేషన్ ఉంటుంది. పర్వత శ్రేణుల నడుమ ఒదిగి ఉన్న ఈ ప్రాంతం ప్రకృతి రమణీయతకు ఆలవాలం. అరకులోయ కేవలం పర్యాటక కేంద్రంగానే కాదు.. లొకేషన్ల పరంగా సినిమా షూటింగ్ లకు కూడా గమ్యస్థానంగా నిలుస్తుంది.

అరకు లోయకు అందాలను పూర్తిగా ఆస్వాదించాలి అనుకుంటే రైల్ ప్రయాణాన్ని మించింది ఇంకొకటి ఉండదు ..అందుకే చాల మంది ప్రయాణికులు వైజాగ్ వరకు తమ సొంత వాహనంలలో వచ్చిన అక్కడి నుంచి అరకు వెళ్ళడానికి మాత్రం రైల్లోనే ప్రయాణిస్తారు ..కిరండూల్ వెళ్లే ప్యాసింజర్ రైలు విశాఖపట్నం స్టేషన్ నుంచి ప్రతిరోజు ఉదయం 7.10 గంటలకు బయలుదేరుతుంది. రైల్వేశాఖ టూరిస్టుల కోసం ఈ రైలుకు అదనంగా అద్దాల బోగీని జత చేసింది. ఇది మిస్ అయితే అరకు వెళ్లే రైలు మరొకటి లభించదు. కాబట్టి ముందుగా ప్లాన్ చేసుకుని స్టేషన్ కు చేరుకోవడం మంచిది.



ఇక అరకులోయలో అత్యంత ప్రసిద్ధి చెందినవి బుర్ర గుహలు.. అరకులోయ పర్యటనకు వెళ్లే టూరిస్టులు తప్పక చూడాల్సిన ప్రదేశం బొర్రాగుహలు. ప్రకృతి చిత్రించిన ఈ అద్భుతం సుమారు 10 లక్షల ఏళ్ల క్రితం ఏర్పడినదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బ్రిటిష్ భౌగోళిక శాస్త్రవేత్త విలియం కింగ్ 1807లో బొర్రాగుహలను కనుగొన్నారు. ఇక్కడ సుమారు 50 వేల సంవత్సరాల నాటి రాతి పనిముట్లు దొరకడంతో ఇక్కడ ఆదిమానవులు జీవించేవారని శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారు. ఏపీ పర్యాటక శాఖ 1990లో ఈ గుహలను తమ ఆధీనంలోకి తీసుకుని అభివృద్ధి చేసింది. గుహల బయట ఉద్యాన మొక్కల పెంపకం, గుహలను వీక్షించే విధంగా లైట్లను ఏర్పాటు చేశారు. దీంతో బొర్రాగుహలను సందర్శించే పర్యటకుల సంఖ్య ఏటా గణనీయంగా పెరుగుతుంది. అరకు నుంచి 36 కిలోమీటర్ల దూరంలో బొర్రా గుహలు ఉన్నాయి. విశాఖ నుంచి రైలులో వచ్చే ప్రయాణీకులు బొర్రా స్టేషన్ లో దిగి ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు. రోడ్డు మార్గం ద్వారా వచ్చే ప్రయాణీకులు ముందుగా బొర్రా గుహలను సందర్శించి అరకు వెళ్లవచ్చు.

అరకు నుంచి 16 కిలోమీటర్ల దూరంలో చాపరాయి జలపాతం ఉంది. నీటి ప్రవాహంతో నునుపుదేరాయా అనే విధంగా కనిపించే బండరాళ్లపై జలపాతం ప్రవాహాలు పర్యాటకులను కట్టిపడేస్తాయి. ఇక్కడ ఫోటోలు దిగేందుకు టూరిస్టులు ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు. ముఖ్యంగా ఇక్కడ లభించే బొంగులో చికెన్ ను మాంసాహారప్రియులు లొట్టలేసుకుని తింటుంటారు.

కాఫీ తోటల నడుమ సాగే అరకు ప్రయాణంలో గిరిజనులు తయారుచేసే సహజసిద్ధ ఉత్పత్తులను కూడా టూరిస్టులు కొనుగోలు చేసుకోవచ్చు. కాఫీ పొడి మొదలుకొని అనేక రకాల వస్తువులను గిరిజనులు విక్రయిస్తుంటారు. మేలురకమైన తేనె, కాఫీగింజలు ఇక్కడ ప్రత్యేకతలు. రుచికరమైన భోజనంతో పాటు బస చేసేందుకు అన్ని బడ్జెట్ లలో హోటళ్లు అందుబాటులో ఉంటాయి. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మాసం మధ్య ప్రయాణం ఇక్కడ ఆహ్లాదభరితంగా ఉంటుంది.