అద్భుతమైన విశేషాలకు నిలయమైన అంగ్ కోర్ వాట్ దేవాలయం

ప్రపంచంలోనే అత్యంత పెద్ద దేవాలయమైన అంగ్ కోర్ వాట్ కు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఐదు వందల ఎకరాల విస్తీర్ణం 65 మీటర్ల ఎత్తయిన భారీ శిఖరం చుట్టూ మరిన్ని శిఖరాలతో కూడిన ఆలయ సముదాయం అద్భుతమైన శిల్పకళ పచ్చని కళతో, నీటి గలగలలు ఇవన్నీ అంగ్ కోర్ వాట్ ప్రత్యేకతలు. వందల ఏళ్ల కిందటి ఈ అద్భుత దేవాలయం ఉన్నది భారతదేశంలో మాత్రం కాదు కాంబోడియాలో ఎన్నో వింతలకు అద్భుతమైన విశేషాలకు నిలయమైన ఈ అంగ్ కోర్ వాట్ దేవాలయం గురించి తెలియని నిజాలు.

కాంబోడియాలో ఉన్న అంగ్ కోర్ వాట్ ఆలయం క్రీస్తుశకం వెయ్యో శతాబ్దానికి చెందిన ప్రఖ్యాత ఖ్మేర్ సామ్రాజ్యంలో భాగం. ఆ సామ్రాజ్యం రాజధాని నగరం పేరు కూడా అంగ్ కోర్. తొలుత ఈ సామ్రాజ్యాన్ని ఇతరులు పాలించినా అనంతరం హిందూ రాజుల పరిపాలనలోకి వచ్చింది. దీనిని కాంభోజ రాజ్యంగా పేర్కొనేవారు. యురోపియన్ల వలసల అనంతరం కాంబోడియాగా మారింది. అంగ్ కోర్ వాట్ ఆలయాన్ని నిర్మించిన రాజు పేరు సూర్యవర్మన్-2. ఆయన విష్ణుమూర్తి ఆరాధకుడు. అంగ్ కోర్ నగరంలో అప్పట్లోనే ఇక్కడ పది లక్షల మంది వరకు నివసించినట్టు చరిత్ర పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

19వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం వచ్చే నాటికి కూడా ప్రపంచంలో అతిపెద్ద నగరం అంగ్ కోర్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా కేవలం నగర ప్రధాన ప్రాంతంలోనే ఏకంగా 5 లక్షల మంది నివసించినట్టుగా గుర్తించారు. అంగ్ కోర్ వాట్ కు సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ‘మహేంద్ర పర్వత’గా పిలిచే మరో పెద్ద నగరం అవశేషాలను కూడా గుర్తించారు.

అంగ్ కోర్ వాట్ ప్రాంతాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించి రక్షిస్తున్నది. అంగ్ కోర్ వాట్ ను కేవలం ఒక్క దేవాలయంగా చెప్పలేం. ఇక్కడ, చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని వందల దేవాలయాలు ఉన్నాయి. అసలు అంగ్ కోర్ వాట్ అంటేనే.. దేవాలయాల నగరం అని అర్థం. క్రీస్తు శకం 1113 సంవత్సరం నుంచి 1150 సంవత్సరాల మధ్య దీనిని నిర్మించినట్టు చరిత్రకారులు నిర్ధారించారు. ఇది సుమారు 500 ఎకరాల్లో విస్తరించి ఉంది.

ప్రపంచంలోనే అన్ని మతాలకు సంబంధించి కూడా అంగ్ కోర్ వాట్ దేవాలయం అతిపెద్దది కావడం గమనార్హం. హిందూ పురాణాల్లో పేర్కొన్న మేరు పర్వతాన్ని తలపించేలా అంగ్ కోర్ వాట్ దేవాలయాన్ని నిర్మించారు. హిమాలయాల అవతల ఉండే మేరు పర్వతం దేవతల నివాసంగా పురాణాలు పేర్కొన్నాయి. అంగ్ కోర్ వాట్ ప్రధాన దేవాలయంపై మధ్యలో 213 అడుగుల (65 మీటర్ల) ఎత్తయిన భారీ గోపురంతోపాటు దానికి నాలుగు పక్కలా కొంత చిన్నగా మరో నాలుగు గోపురాలు ఉన్నాయి. ప్రధాన ఆలయానికి చుట్టూ పలు చిన్న ఆలయాలు ఉన్నాయి. దేవాలయం చుట్టూ అతిపెద్ద నీటి కందకం ఉండటం ఈ ఆలయ విశేషాల్లో ఒకటి.