కాపురం సజావుగా సాగాలి అంటే ఈ కింది సలహాలు పాటించాలి


పెళ్లి అనేది జీవితాంతం కలిసి ఉండటానికి వేసే ఒక గొప్ప ముడి ..అయితే చాల మంది భార్య భర్తలు అనేక గొడవలతో తమ కాపురాన్ని నరకప్రాయం చేసుకుంటున్నారు..అయితే మీ కాపురం సజావుగా సాగాలంటే ఈ సమస్యలు మీ సంసారంలో లేకుండా చూసుకుంటే చాలు అని సలహా ఇస్తున్నారు. ఇంతకీ ఆ రణాలు ఏంటో తెలుసుకుంటే మీ లైఫ్ హ్యాపీనే కదా!

* ఆధిపత్యం

సంసారంలో నేను ఎక్కువ, నువ్వు తక్కువ అనే మాట రానివ్వకూడదు. ఇద్దరం సమానం అనే భావనతో మెలగాలి. ఒకరి పనిలో మరొకరు సహాయపడాలి. ఇంట్లో పని ఇద్దరూ కలిసి చేసుకోవాలి. అవసరం వున్నప్పుడు ఒకరికొకరు అందుబాటులో వుండాలి. ఏ కష్టం వచ్చినా నీకు తోడుగా నేను వున్నాననే భావన, ధీమా జీవిత భాగస్వామిలో కలిగించాలి.

అలా ఎప్పుడైతే జరగదో అప్పుడే కాపురంలో కలహాలు మొదలవుతాయి. ఉదాహరణకి తనకి తన జీవిత భాగస్వామి నుంచి ఎటువంటి ప్రేమ, ఆధరణ దక్కనప్పుడు... ఆ ప్రేమ, ఆధరణని కూడా తిరిగి తమ జీవిత భాగస్వామిపై ప్రదర్శించాలని మరొకరికి కూడా అనిపించదు. అదే కానీ జరిగితే, ఇక ఆ కాపురంలో కలహాలు తప్ప ఇంకేం వుండవు అంటున్నారు ఎక్స్‌పర్ట్స్.

* నిర్లక్ష్యం తగదు

చాలా మంది మ్యారేజ్ అయి కొన్నేళ్లు గడిచిన తర్వాత జీవిత భాగస్వామితో తక్కువ కాలం గడుపుతూ తమతమ ఫ్రెండ్స్‌తో ఎక్కువ కాలం గడపడానికి ఇష్టపడుతుంటారు. సరిగ్గా అదే సమయంలో వారి జీవిత భాగస్వామి ఒంటరితనానికి, అభద్రతా భావానికి గురవుతారనే విషయాన్ని మర్చిపోతారు. అక్కడే అసలు సమస్య మొదలవుతుంది.

అందుకే ఎంతమంది ఫ్రెండ్స్‌తో ఎంత సమయం గడిపినా, అదే సమయంలో జీవిత భాగస్వామికి సైతం సరైన ప్రాధాన్యత ఇవ్వాలనే విషయాన్ని మర్చిపోకూడదు. ఒకరికొకరు కలిసే వున్నామనే భావనని కోల్పోకూడదు. ఎట్టిపరిస్థితుల్లోనూ జీవిత భాగస్వామి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదు.

* పరస్పర గౌరవం

దంపతులు ఇద్దరూ ఒకరినొకరు పరస్పరం గౌరవించుకోవాలి. ఒకరి అభిప్రాయాలకి మరొకరు విలువ ఇవ్వాలి. ప్రతీసారి నా అభిప్రాయమే చెల్లాలి అని దంపతులు ఇద్దరిలో ఎవ్వరు అనుకున్నా... అది ఏదో ఓ రోజు కాపురాన్ని కూల్చే పరిస్థితులకి దారితీస్తుండొచ్చు. జీవిత భాగస్వామి నుంచి లభించని గౌరవం, ఆధరణ, పరస్పర సహకారం మరొకరికి తీవ్ర అసంతృప్తిని మిగిల్చే ప్రమాదం వుంది. అదే కానీ జరిగితే ఏదో ఒక రోజు అదే ఆ అసంతృప్తి లావాలా బద్ధలై కాపురాన్ని కూలదోస్తుంది.

ప్రతీ దాంపత్యానికి పరస్పర సహాకారం, గౌరవం ఎంతో అవసరం అని సూచిస్తున్నారు మ్యారేజ్ కౌన్సిలర్స్. ఈ మూడు విషయాల్లో దంపతులు జాగ్రత్తగా వ్యవహరిస్తే, కౌన్సిలింగ్ కోసం దంపతులు కౌన్సిలర్స్ వద్దకి వెళ్లడం, కోర్టుల చుట్టూ తిరగడం వంటి అవసరమే రాదని బల్లగుద్ది మరీ చెబుతున్నారు.