వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల కిటకిట


లాక్‌డౌన్ సడలింపు లో భాగంగా నేటి నుంచి ఆలయాలు, ప్రార్థనా స్థలాలకు ప్రభుత్వం సడలింపు నివ్వడంతో ఆలయాలు, ప్రార్థనా స్థలాలు తెరుచుకుంటున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయం (రాజ రాజేశ్వర స్వామి టెంపుల్) తలుపులు దాదాపు 80 రోజుల తరువాత నేటి ఉదయం తెరుచుకున్నాయి.

అందులోనూ సోమవారం కావడంతో రాజన్న ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఆలయ పార్కింగ్ స్థలం నుంచి క్యూ లైన్లు ప్రారంభమయ్యాయి. ఆలయానికి వస్తున్న భక్తులకు తొలుత థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. కాళ్లు, చేతులు కడిగిన అనంతరం భౌతికదూరం పాటించాలని ఆలయ సిబ్బంది సూచిస్తున్నారు.

రాజన్న ఆలయ ఈవో రామకృష్ణారావు నేటి ఉదయం క్యూ లైన్లను పరిశీలించారు. కరోనా నిబంధనల ప్రకారం 65ఏళ్లు పైబడిన వారితో పాటు 10ఏళ్ల లోపు చిన్నారులను ఆలయంలోకి అనుమతించడం లేదు.