Weather Latest Updates: అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం...!

కొమరిన్‌ నుంచి తమిళనాడు, దక్షిణాంధ్ర తీరాల మీదుగా నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి వ్యాపించి ఉంది.

ఈ ప్రభావంతో రేపు, బుధవారం దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరుగా.. ఉత్తరాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

గడిచిన 24 గంటల్లో తిరుపతిలో 15 సెం.మీ., గూడూరు, కావలిలో 9, పలమనేరులో 8.. రాపూరు, కందుకూరు, ఉదయగిరి, సత్యవేడులో 7 సెం.మీ.. శ్రీకాళహస్తిలో 6.. నెల్లూరు, తొట్టంబేడు, అట్లూరు, వెంకటగిరి కోటలో 5 సెం.మీ వర్ష పాతం నమోదైంది.

సోమవారం నెల్లూరు వ్యాప్తంగా భారీ వర్షాలు కురవగా, కడప, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. చెరువులు నిండుకోగా, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నెల్లూరు జిల్లావ్యాప్తంగా సోమవారం కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది..

చిత్తూరు జిల్లాలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది.. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నెల్లూరు, కావలితో పాటూ పలు చోట్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇటు రాష్ట్రవ్యాప్తంగా రాత్రివేళ చలి గాలులు వీస్తున్నాయి.