కరోనా నిర్మూలనలో తోడ్పడనున్న మరొక విటమిన్


కరోనా బారిన పడినవారు గాని , పడకుండా జాగ్రత్తలు పడటం కోసం గాని అందరూ విటమిన్ సి , విటమిన్ డి ఎక్కువగా శరీరానికి అందేలా చూసుకోవాలని చెపుతారు.. నిమ్మ జాతి పండ్లను ఆహారంలో భాగంగా చేసుకుంటున్నారు. విటమిన్ డి కోసం ఉదయాన్నే ఎండలో నిలబడుతున్నారు. కాగా కరోనాపై పోరాటంలో మరో విటమిన్ కూడా ఎంతో ప్రయోజనకారిగా ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.

కరోనా బారిన పడిన వారిలో రోగ నిరోధక వ్యవస్థ ఓవర్ రియాక్ట్ అవుతోంది. ఇలా జరగకుండా ఆరోగ్యకరమైన రోగ నిరోధక వ్యవస్థ కొనసాగడంలో.. వ్యాధి లక్షణాలను తగ్గించడంలో విటమిన్-బి సాయపడుతోందని పరిశోధకులు గుర్తించారు. పేషెంట్లకు అందిస్తోన్న చికిత్సతోపాటు.. విటమిన్-బి గురించి కూడా అంచనా వేయాలని సూచిస్తున్నారు.

కణాల పనితీరు, శక్తి జీవక్రియ, రోగనిరోధక వ్యవస్థ సక్రమంగా పని చేయడంలో ‘విటమిన్ బి’ కీలక పాత్ర పోషిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. సహజ నిరోధక శక్తిని పెంచడం, సైటోకైన్ స్థాయిలను తగ్గించడం, శ్వాస వ్యవస్థ పనితీరు మెరుగుపర్చడంలో విటమిన్-బి తోడ్పడుతుందని పరిశోధకులు తేల్చారు. మంట, ఇతర ఇబ్బందులను తగ్గించడం వల్ల పేషెంట్ హాస్పిటల్‌లో ఉండే సమయాన్ని తగ్గిస్తున్నట్లు అధ్యయనంలో గుర్తించారు.