బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఆసుపత్రి నుంచి వీడియో సందేశం


ముంబై లోని నానావతి ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందుతున్న బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఆసుపత్రి నుంచి వీడియో సందేశమిచ్చారు. అక్క‌డ ప‌నిచేస్తున్న డాక్టర్స్‌, ఇత‌ర వైద్య సిబ్బంది, అలాగే దేశంలో ప్ర‌జ‌లకు వైద్యం అందిస్తోన్న ఇత‌ర డాక్ట‌ర్స్‌, ఇత‌ర సిబ్బందికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తూ వీడియో ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చారు.

ప్రస్తుతం చాలా విపత్కర పరిస్థితులున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో కూడా వైద్యులు అద్భుత‌మైన సేవ‌ల‌ను అందిస్తున్నారన్నారు అమితాబ్.

కరోనా విజృంభణ కొనసాగుతున్న ప్రస్తుత ప‌రిస్థితుల్లో వైద్య సిబ్బంది అయిన డాక్టర్లు, నర్సులు దేవుడి వంటి వారని తెలిపారు. మాన‌వత్వంతో ప‌నిచేస్తున్న వారంతా ప్రాణదాతలు అని కొనియాడారు.

''నేను డాక్టర్లకు, నర్సులకు చేతులెత్తి మొక్కుతున్నా. మీరు లేక‌పోతే మ‌నుషులంతా ఏమైపోయేవారో. ఇవి నిరాశ జ‌న‌కంగా ఉన్న రోజుల‌ని నాకు తెలుసు. అంద‌రూ వారి ప‌రిధులు దాటి ప‌నిచేస్తున్నారు. అందరిలోనూ మాన‌సిక ఒత్తిడి, భ‌యం నెల‌కుంది. కానీ నేను చెప్పేదొక్క‌టే ఎవ‌రూ భ‌య‌ప‌డొద్దు, నిరాశప‌డొద్దు. మ‌నము అందరం క‌లిసి పోరాడాల్సిన త‌రుణ‌మిది. నానావ‌తి హాస్పిట‌ల్ సిబ్బందికి ధ‌న్య‌వాదాలు'' అంటూ విలువైన మెసేజ్ పాస్ చేశారు అమితాబ్.

బచ్చన్ ఫ్యామిలీలో ముగ్గురు అమితాబ్ బచ్చన్, కొడుకు అభిషేక్ బచ్చన్, మనవరాలు ఆరాధ్య కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. వారు త్వరగా కోలుకోవాలని పలువురు సెలబ్రిటీలు పెద్ద ఎత్తున ట్వీట్స్ చేస్తున్నారు.