Breaking News: ఏలూరు వింత వ్యాధికి మరో ఇద్దరు బలి...!

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వింతవ్యాధికి కారణం వారి రక్తంలో సీసం, నికెల్ వంటి లోహాల అవశేషాలు పరిమితికి మించి ఉండడమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు.

కలుషిత నీరు తాగడం వల్లే ఇలా జరిగి ఉండొచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు. అయితే ఇది గాలి ద్వారా వ్యాపించినది కాదని, దీని గురించి ప్రజలు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని వారు చెపుతున్నారు.

ఇప్పటివరకు దాదాపు 600 మందికి ఈ వింత వ్యాధి సోకగా, 450 మందికి పైగా చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యారు. అయితే పరిస్థితి విషమంగా ఉందని భావించిన కొందరిని మాత్రం మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇది ఇలాఉండగా విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వింతవ్యాధి బాధితుల్లో మరో ఇద్దరు మృత్యువాతపడ్డారు.

వింత వ్యాధితో బాధపడుతున్న వారిలో 30 మందిని విజయవాడ ఆస్పత్రికి తరలించగా... సుబ్బరావమ్మ(56), అప్పారావు(50) ల పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. అయితే సుబ్బరావమ్మ కరోనాతో, అప్పారావు ఊపిరితిత్తుల సమస్యతో మరణించినట్టు వైద్యులు చెబుతున్నారు.