టీటీడీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు మరోసారి ట్వీట్


తిరుమల తిరుపతి దేవస్థానం పని తీరుపై అనేక మార్లు ట్వీట్ చేసిన రమణ దీక్షితులు ఇప్పుడు మరో సారి ట్వీట్ చేసి సంచలనాలు సృష్టిస్తున్నారు. టీటీడీ గౌరవ ప్రధానార్చకులు రమణ దీక్షితులు మరో సంచలన ట్వీట్ చేశారు. తనను బాధ్యతలు చేపట్టమని జగన్‌ ఆదేశించినా టీటీడీ తనను గౌరవ ప్రధానార్చకుడిగా మాత్రమే ప్రతిపాదించిందని ఆయన వెల్లడించారు.

వైఎస్‌ జగన్ గారు నన్ను వంశపారంపర్య అర్చుకుడిగా బాధ్యతలు చేపట్టమన్నారు. కానీ టీటీడీ మాత్రం ముఖ్యమంత్రి ఆదేశాలను పట్టించుకోకుండా నన్ను గౌరవ ప్రధానార్చకుడి పదవిని ఇచ్చింది. దీన్ని నేను తిరస్కరించాను. సీఎం గారు దీనిపై మీరు ఆదేశాలు జారీ చేయండి. అర్చకులు ఎదురుచూస్తున్నారు అని రమణ దీక్షితులు ట్వీట్ చేశారు.

కానీ ఆ ట్వీట్‌ని కాసేపటికే ఆయన మళ్లీ డిలీట్ చేయడం గమనర్హం. కాగా టీటీడీ పనితీరుపై విమర్శలు చేసిన నేపథ్యంలో రెండేళ్ల క్రితం రమణ దీక్షితులుపై వేటు పడిన విషయం తెలిసిందే. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయనను మళ్లీ ప్రధానార్చకులుగా టీటీడీ నియమించింది. కానీ తనకు వారసత్వ అర్చక పదవి కావాలని రమణ దీక్షితులు కోరుతున్నారు. ఈ క్రమంలో టీటీడీపై ఆ మధ్యన కూడా రమణ దీక్షితులు పలు ట్వీట్లు చేశారు. దీనిపై ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.