టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కమతం రామిరెడ్డి మృతి...


తెలంగాణకు చెందిన టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కమతం రామిరెడ్డి మృతిచెందారు. ఆయన వయసు 83 ఏళ్లు. కమతం మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రామిరెడ్డితో ఉన్న అనుబంధాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.

రామిరెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం కొనసాగిన ఆయనకు 2014 ఎన్నికల్లో ఆ పార్టీ టికెట్ నిరాకరించడంతో బీజేపీలో చేరారు. ఆ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమి తరఫున పరిగి నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. అయినా అప్పుడు ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో రామిరెడ్డికి కేవలం 13 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి.

ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల 2018 ఎన్నికల సమయానికి బీజేపీ ఆయన్ని సస్పెండ్ చేసింది. ఈ క్రమంలో ఎన్నికలు ముగిశాక కేసీఆర్ సమక్షంలో కమతం రాంరెడ్డి టీఆర్ఎస్‌లో చేరారు. కానీ, వయసు పైబడడం వల్ల ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

కమతం రాంరెడ్డి గతంలో ముగ్గురు కాంగ్రెస్ ముఖ్యమంత్రుల హయాంలో మంత్రిగా పని చేశారు. జలగం వెంకళరావు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో వారి మంత్రివర్గంలో ఈయన మంత్రిగా పనిచేశారు.