ఆ ఆర్టికల్ రద్దు తర్వాత ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గాయి ..మంత్రి కిషన్ రెడ్డి

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఉగ్రవాద కార్యకలాపాలు గణనీయంగా తగ్గాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీనికి సంబంధించిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి రాజ్యసభకు లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. 2019 ఆగస్టు 5కు ముందు అంటే 2018 జూన్ 29 నుంచి 2019 ఆగస్టు 4 వరకు 455 ఉగ్రవాద సంఘటనలు జరిగినట్లు చెప్పారు. 2019 ఆగస్టు 5 తర్వాత నుంచి 2020 సెప్టెంబర్ 9 వరకు 211 ఉగ్రవాద దాడి సంఘటనలు మాత్రమే జరిగినట్లు తెలిపారు.

ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) కార్యకలాపాలు క్రియాశీలకంగా ఉన్న రాష్ట్రాలకు సంబంధించిన ప్రశ్నకు కిషన్ రెడ్డి బదులిచ్చారు. నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (ఎన్ఐఏ) దర్యాప్తు ప్రకారం కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, బీహార్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్ముకశ్మీర్‌లో ఐఎస్ ఉగ్రవాదులు క్రియాశీలకంగా ఉన్నట్లు చెప్పారు.

అసోం ఒప్పందంలోని 6‌వ నిబంధనపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ తన నివేదికను అస్సాం ప్రభుత్వానికి సమర్పించిందని, ఈ సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నదని సంబంధిత ప్రశ్నకు కిషన్ రెడ్డి జవాబు ఇచ్చారు.