విద్యాశాఖపై సీఎం కెసిఆర్ ప్రగతి భవన్ లో అధికారులతో సమావేశం ..



ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయడానికి అవసరమైన దీర్ఘకాలిక వ్యూహం రూపొందించి, అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. దీనికోసం విద్యావేత్తలు, విషయ నిపుణులతో వెంటనే సమావేశం నిర్వహించి, అభిప్రాయాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు.

కరోనా నేపథ్యంలో వివిధ రకాల విద్యాసంస్థల నిర్వహణ, పరీక్షల నిర్వహణ, సిలబస్ తదితర విషయాలపై యూజీసీ, ఎఐసీటీఇ తదితర సంస్థల మార్గదర్శకాలను పాటించాలన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాసంస్థల పనితీరును గణనీయంగా మెరుగు పరిచి, అత్యుత్తమ విద్యాబోధన జరిగేలా చేయడం ద్వారానే విద్య పేరు మీద జరుగుతున్న దోపిడిని అరికట్టడం సాధ్యమవుతుందని సీఎం అభిప్రాయపడ్డారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్కొక్క రంగంపై దృష్టి పెట్టి క్రమంగా దీర్ఘకాలిక సమస్యల నుంచి ప్రజలకు శాశ్వత విముక్తి కలిగిస్తూ వస్తున్నాము. విద్యుత్ సమస్య పరిష్కారమైంది. మంచినీటి గోస తీరింది. సాగునీటి సమస్య పరిష్కారం అవుతున్నది. వ్యవసాయ రంగం కుదుటపడుతున్నది. భూకబ్జాలు లేవు. ఇలా అనేక సమస్యలను పరిష్కరించుకోగలుతున్నాము. ఇక రెవెన్యూ శాఖ ప్రక్షాళన, విద్యావ్యవస్థ బలోపేతంపై దృష్టి పెడతాం’’ అని కేసీఆర్ స్పష్టం చేశారు.