తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికల ఏప్రిల్‌లో...?


తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలను ఒకే దశలో పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకేతోపాటు పలు ఇతర పార్టీలు ఈసీని కోరాయి. తమిళనాడు అసెంబ్లీ పదవీకాలం మే 24 తో ముగియనున్నది. వచ్చే ఏడాది జనవరి నెలలో ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఓటర్లు తీవ్ర వేసవికి గురికాకుండా ఉండేలా ఏప్రిల్ మూడు లేదా నాలుగో వారానికి పోలింగ్‌ను ముందుకు తీసుకురావాలని ఈసీని తమ పార్టీ అభ్యర్థించినట్లు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఏఐఏడీఎంకే ఎన్నికల విభాగం కార్యదర్శి పొల్లాచి వీ జయరామన్ పేర్కొన్నారు. ఏప్రిల్‌ మూడు, నాలుగో వారాల్లో ఎన్నికలు జరిపేలా చూడాలంటూ ఆ మేరకు ఈసీకి వినతిపత్రం సమర్పించారు.

ఒకే దశలో అసెంబ్లీకి ఎన్నికలు జరిపేలా చర్యలు తీసుకోవాలని ఈసీతో సమావేశమైన డీఎంకే పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి ఆర్‌ ఎస్‌ భారతి సూచించారు. ఈ మధ్యకాలంలో అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో జరుగుతున్నాయి. అధికారిక యంత్రాంగాల దుర్వినియోగం నివారించడానికి ఎన్నికలను ఒకే దశలో నిర్వహించాలని ఈసీని అభ్యర్థించినట్లు ఆమె మీడియాతో చెప్పారు. మంగళవారం ఈసీ బృందం వివిధ కార్యనిర్వాహక సంస్థలతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఇతర ప్రభుత్వ కార్యదర్శులతో సమావేశం కానున్నది. మెట్రో నగరంలో పర్యటనకు ఉమేశ్‌ సిన్హాతో పాటు డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు సుదీప్ జైన్, ఆశిష్ కుంద్రా, బిహార్ ప్రధాన ఎన్నికల అధికారి హెచ్ ఆర్ శ్రీనివాసా, డైరెక్టర్ పంకజ్ శ్రీవత్సవ, భారత ఎన్నికల కమిషన్ కార్యదర్శి మలయ్ మల్లిక్ ఉన్నారు.