వ్యవసాయ చట్టాల సమస్య పరిష్కారానికి ప్రత్యేక కమిటీ...


బీజేపీ ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ భారతీయ కిసాన్‌ యూనియన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డె, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్న, జస్టిస్‌ రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. వివాదాస్పదంగా మారిన నూతన వ్యవసాయ చట్టాల అమలును కొంతకాలం ఆపాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. తమ సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు రైతులకు ఉన్నదని స్పష్టంచేసింది. రైతన్నల నిరసనోద్యమంలో జోక్యం చేసుకోబోమని తేల్చిచెప్పింది. ఈ అంశంపై దాఖలైన అన్ని పిటిషన్లను కలిపి విచారిస్తామని తెలిపింది. సమస్యను అధ్యయనం చేసేందుకు రైతు సంఘాలు, వ్యవసాయ నిపుణులతో కమిటీ వేయనున్నట్టు గురువారం ప్రకటించింది.

వ్యవసాయ చట్టాల విషయంలో బీకేయూ వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన త్రిసభ్య ధర్మాసనం ఈ అంశంపై నిష్పాక్షిక, స్వతంత్ర కమిటీని వేయనున్నట్టు పేర్కొంది. కమిటీ అధ్యయనం పూర్తయ్యేవరకు చట్టాలను వాయిదా వేయాలని సూచించింది. ప్రభుత్వం తరఫున విచారణకు హాజరైన అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్ సుప్రీం సూచనను వ్యతిరేకించారు. ప్రముఖ వ్యవసాయరంగ నిపుణుడు పీ సాయినాథ్‌ వంటి వారితో కమిటీని వేస్తామని పేర్కొంది. చట్టాల అమలును నిలిపేస్తే రైతులు చర్చలకు రారని వాదించారు. ఈ వాదనను తోసిపుచ్చిన కోర్టు తాము చట్టాల అమలును పూర్తిగా నిలిపివేయాలని కోరటం లేదని వ్యాఖ్యానించింది.