కరోనా నిబంధనలతో శబరిమల యాత్ర

నియమ నిష్టలకతో వ్రతాన్ని ఆచరించే అయ్యప్ప భక్తులకు తీపి వార్త. కరోనా నిబంధనల ప్రకారం శబరిమల దర్శనాలు నిర్వహిస్తామని కేరళ దేవాదాయశాఖ మంత్రి కదకంపల్లి సురేంద్రన్‌ తెలిపారు. నవంబర్‌ 16 నుంచి వర్చువల్ క్యూ పద్దతిలో యాత్ర ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. శబరిమల యాత్ర నిర్వహణపై సోమవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.
అయితే యాత్రకు వచ్చే భక్తులు తప్పనిసరిగా కొవిడ్-19 నెగటివ్ ధృవీకరణ పత్రం సమర్పించాలని, పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తామని ఆయన పేర్కొన్నారు. ఐసీఎంఆర్ గుర్తింపు పొందిన ల్యాబ్‌లోనే పరీక్షలు చేయించుకోవాలని స్పష్టం చేశారు.
కరోనా మహమ్మారి నేపథ్యంలో దర్శనం కోసం వచ్చే భక్తులకు స్క్రీనింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులకు మెరుగైన సేవలను అందించడం కోసం సన్నిధానం, పంబ, నీలక్కల్‌లోని ఆస్పత్రులను మరింత బలోపేతం చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. భక్తుల మధ్య భౌతిక దూరం ఉండేలా పంప, నీలక్కల్ మధ్య మరిన్ని కేఎస్‌ఆర్టీసీ (కేరళ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ) బస్సులు నడపనున్నట్లు తెలిపారు.
అలానే విపత్తు నిర్వహణలో భాగంగా అత్యవసర పరిస్థితుల్లో హెలికాఫ్టర్‌ సేవలను ఉపయోగించుకునేందుకు ఒక హెలికాఫ్టర్‌ను అందుబాటులో ఉంచాలని పత్తనం తిట్ట కలెక్టర్‌ ప్రభుత్వాన్ని కోరారు. యాత్రకు వచ్చే భక్తుల సౌకర్యార్థం తాము కూడా తగిన ఏర్పాటు చేయనున్నట్లు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షడు ఎన్‌.వాసు తెలిపారు.