ఫ్లైఓవర్‌ బ్రిడ్జితో ట్రాఫిక్‌ సమస్యలకు విముక్తి...


నిజాంపేటలో హైటెక్‌సిటీకి బైక్‌పై బయల్దేరితే గంట సమయం పట్టేది. వివేకానందనగర్‌ నుంచి కారులో మెహిదిపట్నం వెళ్లాలంటే రెండు గంటలు ట్రాఫిక్‌లోనే అవుతుంది. ఇలా రోజూ ఎంతో మంది వాహనదారులు ట్రాఫిక్‌ కష్టాలు పడేవాళ్లు. మరి కొందరైతే ట్రాఫిక్‌ ఇబ్బందులు పడలేక ప్రయాణాలు వాయిదే వేసుకునేవారు. అందరి సమస్యలకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఫుల్‌స్టాప్‌ పెట్టింది. ట్రాఫిక్‌ సమస్యలను గుర్తించిన ప్రభుత్వం నివారణకు చర్యలు చేపట్టి అనతి కాలంలోనే సమస్యలకు చెక్‌ పెట్టింది. ఫలితంగా ప్రస్తుతం వాహనదాలకు సమస్యలు తొలిగిపోయాయి. గమ్యం చేరువైంది.

కేపీహెచ్‌బీ కాలనీ హైటెక్‌సిటీ మార్గంలో రాజీవ్‌గాంధీ చౌరస్తాలో నిర్మించిన ఫ్లైఓవర్‌ బ్రిడ్జితో ట్రాఫిక్‌ సమస్యలకు విముక్తి లభించింది. కేపీహెచ్‌బీ కాలనీ, కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌, ఆల్విన్‌కాలనీ, జగద్గిరిగుట్ట, ప్రగతినగర్‌, నిజాంపేట, బాచుపల్లి చెందిన వారంతా హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, మెహిదిపట్నం ప్రాంతాలకు వెళ్లాలంటే కేపీహెచ్‌బీ కాలనీని దాటాల్సి ఉంటుంది. ఈ మార్గంలో నిత్యం ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తేవి.

ఈ సమస్యలపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం ఫ్లైఓవర్‌ బ్రిడ్జిల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. రాజీవ్‌గాంధీ చౌరస్తాలో రూ.97.93 కోట్లతో నిర్మించిన ఫ్లైఓవర్‌ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో ట్రాఫిక్‌ సమస్యలు తగ్గాయి. కేపీహెచ్‌బీ కాలనీ 7వ ఫేజ్‌ సమీపంలో రూ.59.09 కోట్లతో నిర్మిస్తున్న రైల్వే అండర్‌పాస్‌ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే ట్రాఫిక్‌ సమస్యలన్నీ పూర్తిగా తీరుతాయి. మరోవైపు రోడ్డు విస్తరణ, ఫుట్‌పాత్‌ల ఏర్పాటు, బస్‌బేలను అందుబాటులోకి తీసుకొచ్చింది.