కరోనా బారిన పడిన ఆర్బీఐ గవర్నర్ ..


ఆర్‌బీఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) గవర్నర్ శక్తికాంత దాస్‌ కరోనా బారినపడ్డారు. తనకు కరోనా లక్షణాలేవీ లేకపోయినప్పటికీ కోవిడ్-19 నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చిందని తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. తనకు కరోనా సోకిన నేపథ్యంలో తనతో సన్నిహితంగా మెలిగినవారంతా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

ప్రస్తుతం తాను క్షేమంగానే ఉన్నానని, ఐసోలేషన్ లోనే విధులు నిర్వర్తించనున్నానని చెప్పారు. నలుగురు డిప్యూటీ గవర్నర్లు బీపీ కనుంగో, ఎంకే జైన్, ఎండి పత్రా, ఎం రాజేశ్వర్ రావు నేతృత్వంలో బలంగా ఉన్న ఆర్‌బీఐ కార్యకలాపాలు యధావిధిగా కొనసాగుతాయని గవర్నర్ ట్వీట్ చేశారు.

కరోనా సంక్షోభం, లాక్ డౌన్ కాలంలో కార్యకలాపాలను సమీక్షిస్తూ, ఆర్థిక వృద్ధిని పునరుద్ధరించే ప్రయత్నాలతో గవర్నర్ బిజీగా గడిపిన సంగతి తెలిసిందే. కాగా దేశంలో కరోనా విస్తరణ కాస్త తగ్గుముఖంపట్టినట్టు కనిపిస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం నాటి గణాంకాల ప్రకారం 78 లక్షలకు పైగా కేసులు నమోదవగా, మరణాల సంఖ్య 1.18 లక్షలకు చేరుకుంది.