అరుదైన ఘనత సాధించిన విరాట్ కోహ్లీ...


టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. కాన్‌బెర్రా వేదికగా ఆతిథ్య ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో 13వ ఓవర్ అబాట్ వేసిన తొలి బంతిని మిడాఫ్ దిశగా ఆడి సింగిల్ తీయడంతో వన్డేల్లో 12వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు కోహ్లీ. వన్డేలలో అత్యధిక వేగంగా 12,000 పరుగులు పూర్తి చేసిన క్రికెటర్‌గా భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ నిలిచాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డే ద్వారా కోహ్లీ ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

గతంలో ఈ రికార్డు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. సచిన్ 309 మ్యాచ్‌లు (300 ఇన్నింగ్స్)లలో 12వేల పరుగులు పూర్తి చేయగా, విరాట్ కోహ్లీ కేవలం 242 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్ సాధించడం గమనార్హం. ఈ మ్యాచ్‌కు ముందు రన్ మేషీన్ విరాట్ కోహ్లీ 23 పరుగుల దూరంలో ఉన్నాడు. కాన్‌బెర్రా వేదికగా ఆతిథ్య ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో 13వ ఓవర్ అబాట్ వేసిన తొలి బంతిని మిడాఫ్ దిశగా ఆడి సింగిల్ తీయడంతో వన్డేల్లో 12వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు కోహ్లీ. భారత కెప్టెన్‌కు ఈ మైలురాయి చేరుకోవడానికి 251 వన్డేలు ఆడాల్సి రాగా, సచిన్ టెండూల్కర్ 309 మ్యాచ్‌లలో ప్రాతినిథ్యం వహించాడు. కాగా, వన్డేల్లో 12000 పరుగులు సాధించిన ఆరో ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. గతంలో సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, కుమార సంగక్కర, సనత్ జయసూర్య మహేల జయవర్దనే ఈ రికార్డుకు చేరుకున్నారు. కోహ్లీ త్వరలోనే జయవర్దనే, జయసూర్య, సంగక్కర రికార్డును అధిగమించనున్నాడు.