తిరుమల శ్రీవారి ఆస్తులు, ఆభరణాలపై ఆడిట్‌ జరగాలని రమణ దీక్షితులు ట్వీట్


తిరుమల శ్రీవారి ఆస్తులు, ఆభరణాలపై ఆడిట్‌ జరగాలని టీటీడీ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు సంచలన ట్వీట్ చేశారు. ఎన్టీఆర్‌ కాలం నుంచి ఇప్పటి వరకు టీటీడీ ఆస్తులు, ఆభరణాల ఆదాయం, ఖర్చులపై జాతీయ స్థాయిలో ఆడిట్‌ జరపాలి అంటున్నారు. తన డిమాండ్లను ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ట్వీట్‌‌కు రిప్లైగా ట్యాగ్ చేశారు. రమణ దీక్షితులు చేసిన ఈ ట్వీట్ ఆసక్తికరంగా మారగా సుబ్రహ్మణ్య స్వామి ఎలా స్పందిస్తారన్నది చూడాలి.

టీటీడీ భూముల అంశంపై ఓ వైపు దుమారం రేగుతున్న సమయంలో దీక్షితులు చేసిన ఈ ట్వీట్ ఆసక్తికరంగా మారింది. అంతేకాదు తిరుమల వెంకన్న లడ్డూల అమ్మకాన్ని రమణ దీక్షితులు తప్పుబట్టారు. స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని విక్రయించడం సరైన నిర్ణయం కాదని ఆగమ పండితుల సలహా తీసుకోకుండా టీటీడీ నిర్ణయం తీసుకుందన్నారు.


గత ప్రభుత్వ హయాంలో టీడీడీలో పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు పెద్దగా మార్పులు ఏవీ లేవన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కి కొంతమంది తప్పుడు సలహాలు ఇస్తున్నారని వెంటనే సీఎం జోక్యం చేసుకోవాలన్నారు. భక్తుల మనోభావాల్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని లేని పక్షంలో టీటీడీ ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉందన్నారు.