చంద్రబాబు చేసిన తప్పే పవన్ చేస్తున్నారా.. జనసేన దెబ్బతినడం ఖాయం..!

దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ విజయదుంధుబి మోగించడంతో తెలంగాణ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి.

వచ్చే నెలలో జరిగే జీహెచ్ఎంసి ఎన్నికలపైనే అందరి దృష్టి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలలో జనసేన పోటీ చేయబోతున్నట్టు ప్రకటన వచ్చేసింది. అయితే ఈ ప్రకటన పవన్ కళ్యాణ్ చెయ్యకపోవడం విశేషం.

జనసేన పార్టీ తెలంగాణ ఇంఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ తో ప్రకటన చేయించారు. శంకర్ గౌడ్ గత ఎన్నికలలో జనసేన తరపున సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.

అయితే ఈ ప్రకటనతో తెలంగాణ పార్టీ విషయంలో చంద్రబాబు నాయుడు చేసిన విధంగానే పవన్ కళ్యాణ్ కూడా తప్పు చేస్తున్నారా అని రాజకీయ నిపుణులు అంటున్నారు.

“టీడీపీ ని తెలంగాణలో పట్టించుకోకుండా.. తాను రంగంలోకి దిగకుండా అక్కడి నాయకులతోనే కథ నడిపించి భంగపడ్డారు చంద్రబాబు. ఇప్పుడు టీడీపీ తెలంగాణలో అంతర్ధానం అయ్యే పరిస్థితి వచ్చింది.

పవన్ కళ్యాణ్ కూడా అదే వ్యూహంలో ఉంటే జనసేన దెబ్బతినడం ఖాయం,” అని వారు అభిప్రాయపడుతున్నారు. ఇది ఇలా ఉండగా… ఈ ఎన్నికలలో జనసేన బీజేపీతో కలిసి పోటీ చేస్తుందో లేక విడిగా పోటీ చేస్తుందో తెలియరాలేదు.

వచ్చే నెల 6న జీహెచ్ఎంసి ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే అన్ని విషయాలలోనూ తొందరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.