సీతక్క పొగడ్తలతో ముంచెత్తిన పరిటాల శ్రీరామ్


ములుగు ఎమ్మెల్యే సీతక్క లాక్ డౌన్ తో తిప్పలు పడుతున్న ములుగు నియోజక వర్గ ఆదివాసీల కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. ప్రజల కష్టాలను తీరుస్తూ, కడుపులో పెట్టుకొని చూసుకుంటూ ముందుకు సాగుతున్నారు. వారికి నిత్యావసర వస్తువులు అందజేస్తున్నారు. సీతక్క చేస్తున్న సేవలను అందరు కొనియాడుతున్నారు.


ఈ నేపథ్యంలో దివంగత పరిటాల రవి వారసుడు, తెలుగు దేశం పార్టీ యువ నాయకుడు పరిటాల శ్రీరామ్ సోమవారం ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘అమ్మా.. మకిలిపట్టిన రాజకీయాల్లో నువ్వే మాకు ఆదర్శం’ అని వ్యాఖ్యానించారు. ‘‘లాక్ డౌన్ సమయంలో అడవి బిడ్డల ఆకలి కేకలు అర్థం చేసుకొని వాగులు వంకలు దాటుకుంటూ నువ్వు వెళ్లి చేస్తున్న సాయం నేను రోజూ చూస్తూనే ఉన్నా అమ్మ. నీ సేవా స్ఫూర్తి అద్భుతం, ఆదర్శప్రాయం. మకిలి పట్టిన ఈ రాజకీయ వ్యవస్థలో నీలాంటి నిజమైన, నిఖార్సయిన రాజకీయ నాయకులే మా యువతరానికి ఆదర్శం’’ అంటూ పరిటాల శ్రీరామ్ భావోద్వేగంతో ట్వీట్ చేశారు.దీనికోసం పరిటాల శ్రీరామ్‌కు సీతక్క ధన్యవాదాలు తెలిపారు.